తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ వారాసిగూడలో బాలిక హత్య పథకం ప్రకారమే జరిగినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. తొలుత అనుమానాస్పద మృతి అని భావించినప్పటికీ.. హత్య అని నిర్థారణ అయిన తర్వాత పోలీసులు మూడు బృందాలను రంగంలోకి దించారు.

వందలాది సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఫుటేజ్‌ను విశ్లేషణ చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నజ్మా మేడ పైన చదువుకుంటోందని భావించిన కుటుంబసభ్యులకు ఎవరో చంపేశారని తెలియడంతో కన్నీటిపర్యంతమయ్యారు.

Also Read:బాలిక మృతి కేసులో ట్విస్ట్: హత్య చేసి విఫల ప్రేమికుడి లొంగుబాటు

కుటుంబసభ్యులతో మాట్లాడిన పోలీసులకు సోహెబ్.. బాలిక వెంట పడుతున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల నుంచి పెళ్లి చేసుకంటానని తమ కుమార్తె వెంటపడుతున్నాడని వారు పోలీసులకు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సోహెబ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇంట్లో మంచం కింద దాక్కొన్న అతనిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. పోలీసులు విశ్లేషించిన సీసీ కెమెరా ఫుటేజ్‌లలో సోహెబ్ ఇంటి నుంచి బయటకు వస్తున్న, మృతురాలి ఇంటి మేడపైకి వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అతని ఫేస్‌బుక్ పేజీని ఓపెన్ చేసి చూడగా సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోల్చి చూడగా అతడే నిందితుడని తేల్చుకున్నారు.

Also Read:వారాసిగూడలో దారుణం: రేప్ చేసి భవనంపై నుండి పడేశారా?

గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.45 గంటలకు సోహెబ్.. మృతురాలి ఇంటికి వచ్చి టెర్రస్ పైకి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న బాలికతో ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై గొడవ పడ్డాడు. వేరే వ్యక్తులతో చాటింగ్ చేయడంపై మండిపడిన సోహెల్ దగ్గరలో ఉన్న గ్రానైట్ రాయితో ఆమె తలపై మోది హత్య చేశాడు.

అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి రెండు భవనాల మధ్య కిందకి తోసేసి ఏం ఎరగనట్లు ఇంటికి వెళ్లిపోయాడు. బాలిక చనిపోయిందా లేదా అన్నది నిర్థారించుకోవడానికి వేకువజామున 3.15 నిమిషాలకు మరోసారి బాధితురాలి ఇంటికి వచ్చి కన్ఫార్మ్ చేసుకుని వెళ్లాడు.