హైదరాబాద్: సికింద్రాబాదులోని వారాసిగుడాలో జరిగిన బాలిక మృతి కేసు మిస్టరీ వీడింది. నిందితుడు స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇంటర్మీడియట్ విద్యార్థిని భవనంపై నుంచి పడి మరణించిన విషయం తెలిసిందే. రాత్రి చదువుకునేందుకు భవనంపైకి వెళ్లి బాలిక శవమై భవనం కింద కనిపించింది. 

రెండంతస్తుల భవనంలో ఇంటర్ విద్యార్థిని, ఆమె తల్లి, సోదరుడు, సోదరి నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం భవనంపైకి వెళ్లిన ఓ మహిళ రక్తం మరకలు ఉండడాన్ని గుర్తించి పరిశీలించింది. భవనం సమీపంలో బాలిక శవం పడి ఉంది. ఆ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

Also Read: వారాసిగూడలో దారుణం: రేప్ చేసి భవనంపై నుండి పడేశారా?

పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.ఈ క్రమంలో నిందితుడు షోయబ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. బాలికను తానే హత్య చేశానని షోయబ్ పోలీసులకు చెప్పాడు. బాలికను తనకు ఇచ్చి వివాహం చేయనందుకే చంపేసినట్లు చెప్పాడు.

బాలికను హత్య చేయడానికి షోయబ్ ఎవరి సహకారం తీసుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను హత్య చేసిన తర్వాత అతను ఎక్కడికి వెళ్లాడు, ఎక్కడెక్కడ తిరిగాడనే విషయాలను కూడా రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

బాలిక శరీరంపై 11 చోట్ల గాయాలున్నాయి. బాలికను షోయబ్ కొట్టి చంపి కింద పడేసినట్లు భావిస్తున్నారు. బాలికను పెళ్లి చేసుకుంటానని షోయబ్ ఆమె తల్లిదండ్రులతో చెప్పాడని, అయితే వారు నిరాకరించారని అంటున్నారు. బాలిక తల్లిడండ్రులు నిరాకరించడంతో షోయబ్ కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.