Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ బిజెపిలో చిచ్చు

  • అంతర్గత కుమ్ములాటలతో సతమతం
  • పార్టీని వీడిన రవలి కుంచన
  • అర్బన్ అధ్యక్షురాలు చేబట్టే పార్టీ మారినట్లు చెబుతున్న రవళి
Warangal BJP  being torn apart with internal feud

ఒకవైపు తెలంగాణలో పాగా వేయాలన్న కసితో కేంద్ర నాయకత్వం ఉంటే.. మరోవైపు అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్ర బిజెపి ముందుకు పోతున్నది. పార్టీలో ఉన్నవారికే గుర్తింపు లేని పరిస్థితుల్లో.. కొత్త వారు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత కొంతకాలంగా పార్టీలోకి వచ్చిన వారు ఉండలేక.. కొత్త వారు చేరలేక తెలంగాణ బిజెపి ఎదుగుదల నత్తనడకన సాగుతున్నది.

ఇక వరంగల్ జిల్లాలో రెండు వర్గాలుగా నిట్టనిలువునా చీలిపోయింది కమలదళం. జిల్లాలో యాక్టీవ్ వర్కర్ గా ఉన్న మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రవళిరెడ్డి కుంచన బిజెపి కి రాజానామా చేశారు. తాను ఏ కారణాల చేత రాజీనామా చేయాల్సివచ్చిందో ఆమె తన రాజీనామా లేఖలో వివరించారు. పూర్తి వివరాలను ఫేస్ బుక్ లో వీడియో పోస్టు చేసి తెలిపారు. ఆమె చెబుతున్న వివరాల ప్రకారం వరంగల్ బిజెపిలో రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కనబడుతున్నది. ఒక వర్గం వారికి బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ నాయకత్వం వహిస్తున్నారు. ఈ వర్గం వారిదే జిల్లాలో హవా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రత్యర్థి వర్గం వారిని రావు పద్మ వర్గం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రత్యర్థి వర్గం వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. దీంతో మిగతా వారంతా పార్టీని వీడుతున్నట్లు చెబుతున్నారు.

వరంగల్ పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం కేంద్ర నాయకత్వం కోటి 30లక్షల వరకు గతంలోనే నిధులిచ్చింది. ఆ నిధులతో రావు పద్మ వర్గం వారు వివాదాస్పద భూమిని అగ్గువకు కొనుగోలు చేశారని, కేంద్రం నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేయలేకపోయారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. తీరా ఆ భూమి ఓనర్ కోర్టుకుపోయి స్టే తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో రావు పద్మారెడ్డి, ఆమె భర్త అమరేందర్ రెడ్డి ఇద్దరే ఏకపక్షంగా భూమిని కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి.

జిల్లాలో రాజేశ్వర్ రావు వర్గం సీనియర్ నేత జంగారెడ్డి వర్గాలతోపాటు ధర్మారావు వర్గం కూడా చెలామణి అవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజేశ్వర్ రావు వర్గం, ధర్మారావు వర్గం సయోధ్యతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక జంగారెడ్డి వర్గం, రావు పద్మారెడ్డి వర్గం అండర్ కరెంట్ దగ్గరగా ఉంటున్నాయని అంటున్నారు.

రావు పద్మ చేబట్టే పార్టీ మారిన : రవళి రెడ్డి

బిజెపిలో గత నాలుగేళ్ల కిందట చేరారు రవళి కుంచన. టివి యాంకర్ గా ఉన్న రవలి కుంచన రాజకీయాల్లో అడుగు పెట్ట కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.  ఈమె పార్టీలో చేరిన నాటినుంచి యాక్టీవ్ వర్కర్ గా పనిచేశారు. పార్టీ ఈమె సేవలను గుర్తించి మహిళా మోర్చా వైస్ ప్రసిడెంట్ పదవి ఇచ్చింది. అయితే ఈమెకు పార్టీ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మజారెడ్డికి మధ్య వార్ నడిచినట్లు చెబుతున్నారు. ఆమె వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని రవలి కుంచన  ఏషియానెట్ కు చెప్పారు. రావు పద్మారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బిజెపి పార్టీ అంటే భార్య, భర్తల సొంత ఆస్థి అన్నట్లు భావిస్తున్నారని రవళి చెబుతున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో బిజెపి వ్యవహరిస్తున్న తీరు కూడా తాను పార్టీ మరడానికి కారణంగా చెబుతున్నారు రవళి. ఒకవైపు టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అంటూ.. మరోవైపు టిఆర్ఎస్ తో అంటకాగే ప్రయత్నం చేస్తున్నారని రవళి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవళి కుంచన పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తునందుకు ఆమెను సస్పెండ్ చేశామంటూ ప్రకటన వెలువరించడం పట్ల రవళి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్ విషయంలో ఆమె ఏం మాట్లాడారో.. ఈ కింద వీడియోలో వివరించారు. చూడొచ్చు.

 

మొత్తానికి వరంగల్ బిజెపిలో వర్గపోరు తారా స్థాయికి చేరిందనడానికి రవళి రెడ్డి రాజీనామా ఒక కారణంగా చెప్పవచ్చు. మరి ఈ పరిస్థితులను పార్టీ ఎలా కంట్రోల్ చేస్తుందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios