Asianet News TeluguAsianet News Telugu

మేం పార్టీలోకి రమ్మనలేదు.. డీఎస్సే చేరుతానన్నారు, కాంగ్రెస్‌ను అభాసుపాలు చేయాలనే : వీహెచ్

కాంగ్రెస్ పార్టీకి డీ శ్రీనివాస్ రాజీనామా చేయడంపై స్పందించారు వీ హనుమంతరావు. తాము ఆయనను కాంగ్రెస్‌లోకి రమ్మనలేదని, ఆయనే వస్తానని అన్నారని వీహెచ్ పేర్కొన్నారు. 

v hanumantha rao reacts on d srinivas resign to congress
Author
First Published Mar 27, 2023, 6:33 PM IST

కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై వీ హనుమంతరావు స్పందించారు. తాము కాంగ్రెస్‌లోకి రమ్మనలేదన్నారు. కాంగ్రెస్‌ను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని.. ఢిల్లీకి వెళ్లి ఆయనే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారని వీహెచ్ అన్నారు. పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించామని.. మీ కొడుకును కూడా పార్టీలో చేర్చుకోవాలని చెప్పానని వీ హనుమంతరావు పేర్కొన్నారు. 

కాగా.. నిన్న కాంగ్రెస్‌లో చేరిన డీఎస్.. ఈ రోజు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు డీఎస్ రాజీనామా లేఖను పంపారు. డీఎస్ రాజీనామా లేఖను ఆయన  భార్య ధర్మపురి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. ఆ వీడియోలో డీఎస్ రాజీనామా లేఖపై సంతకం చేస్తున్నట్టుగా కూడా చూపెట్టారు. కాంగ్రెస్ వాళ్లు, మీడియా వాళ్లు తమ ఇంటికి రావొద్దని విజయలక్ష్మి కోరారు. రాజీనామ లేఖను కూడా చూపించారు. డీఎస్‌కు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు. 

ALso REad: డీఎస్‌ కుటుంబంలో చేరికల చిచ్చు.. కాంగ్రెస్‌లో చేరిన మరుసటి రోజే పార్టీకి రాజీనామా.. (వీడియో)

మరోవైపు ధర్మపురి విజయలక్ష్మి పేరుతో విడుదలై లేఖలో.. ‘‘ఇగో డిఎస్ గారి రాజీనామా ! ఇది రాజకీయాలు చేసే సమయం కాదు ! ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్దతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి.. మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్లకి చేతులు జోడించి దండం పెడుతున్న! ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి’’ అని పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్‌లో చేరిన మరసుటి రోజే డీఎస్.. ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అయితే ఆయన కుటుంబంలో నెలకొన్న రాజకీయ ఘర్షణే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. 8 ఏళ్ల కిందట కాంగ్రెస్‌ను వీడిన డీఎస్.. బీఆర్ఎస్‌లో చేరారు. కొంతకాలానికి ఆ పార్టీకి దూరమయ్యారు. మరోవైపు డీఎస్ ఇద్దరు కుమారులలో.. ఒకరైన ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే నిన్న మరో కుమారుడు ధర్మపురి సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరారు. సంజయ్‌తో పాటు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ వీల్‌ ఛైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చిన డీఎస్.. అక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఈ పరిణామాలు ప్రస్తుతం బీజేపీలో ఉన్న అరవింద్‌కు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉండటంతో.. కుటుంబంలో నెలకొన్న రాజకీయ ఘర్షణ నేపథ్యంలోనే తాజాగా డీఎస్‌ రాజీనామా ప్రకటన వెలువడినట్టుగా తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios