అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఏర్పాటు చేసిన ఫేక్ యూనివర్సిటీ వలలో సుమారు 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇలా
దేశం కానీ దేశంలో చిక్కుల్లో పడిన తెలుగు విద్యార్థులకు సాయం చేయడానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు. హైదరాబాద్ లో యూఎస్  కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డాతో కేటీఆర్ సమావేశమై ఈ విషయం చర్చించారు.  

ప్రగతి భవన్ లో వీరిద్దరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమెరికా పోలీసుల చెరలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల గురించి కేటీఆర్ ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఇలా నకిలీ దృవపత్రాలతో యూఎస్ లో నివాసముంటున్న తెలుగు విద్యార్థులు, వారి సమస్యపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వీరిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని...అందుకోసం పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని కోరారు. విద్యార్థుల పట్ల కఠినంగా కాకుండా సానుభూతితో వ్యవహరించాలని హడ్డాను కేటీఆర్ కోరారు. 

ఈ సమావేశం అనంతరం కేథరిన్ మాట్లాడుతూ... తెలంగాణ-అమెరికాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల  గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి  సహకారం గురించి చర్చించినట్లు వెల్లడించారు. 

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ కి ఆమె అభినందనలు తెలిపారు. అన్ని విషయాల్లో అత్యంత చొరవ, ఉత్సాహం చూపించే కేటిఆర్‌కి ఈ నూతన పదవీ బాధ్యతలు సరిగ్గా సరిపోతాయని అభిప్రాయపడ్డారు.

 

 

సంబంధిత వార్తలు

యుఎస్ ఫేక్ వర్సిటీ: అమెరికాలో తెలంగాణ గర్భిణి అరెస్ట్

యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్: తెలుగువారిని ట్రాప్ చేశారిలా..?

ఫేక్ యూనివర్సిటీ కలకలం: తెలుగువారి కోసం రంగంలోకి తానా

అమెరికా ఫేక్ వర్సిటీ వలలో తెలుగు విద్యార్థులు: మోసగాళ్లలో 8 మంది తెలుగువాళ్లు వీరే