హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న మురళీధర్ రావుకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.. జాతీయ కార్యవర్గంలో రాష్ట్రం నుండి ఎవరికి అవకాశం లభించనుందోననే చర్చ సాగుతోంది.

కేంద్ర మంత్రివర్గంలో కూడ తెలుగు రాష్ట్రాల నుండి ప్రాతినిథ్యం దక్కే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. అయితే ఇతర పార్టీల నుండి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత లభిస్తోందా.. మొదటి నుండి పార్టీలో కొనసాగిన వారికి ప్రాధాన్యత ఇస్తారా అనే చర్చ సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడానికి కమలదళం ప్రయత్నాలు చేస్తోంది.ఈ మేరకు రెండు రాష్ట్రాల్లో నాయకత్వాలను కూడ మార్చింది. తెలంగాణలో ఎంపీ బండి సంజయ్ కు బాధ్యతలను అప్పగించింది. ఏపీ రాష్ట్రంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు  బీజేపీ బాధ్యతలను కట్టబెట్టింది.

also read:సోము వీర్రాజుకు బీజేపీ చీఫ్ పదవి: కమల దళం వ్యూహామిదే...

వచ్చే ఎన్నికల నాటికి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న మురళీధర్ రావుకు మరోసారి పార్టీ పదాధికారిగా బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 

సామాజిక సమీకరణాల నేపథ్యంలో అది సాధ్యం కాకపోతే రాజ్యసభకు ఆయన పంపే ఛాన్స్ ను కొట్టిపారేయలేమని బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.రాజ్యసభకు అవకాశం కల్పించి కేంద్ర మంత్రివర్గంలో కూడ మురళీధర్ రావుకు అవకాశం కల్పించే చాన్స్ ఉందని చెబుతున్నారు. 

also read:కన్నా లక్ష్మినారాయణకు షాక్: ఏపీ బిజెపి కొత్త చీఫ్ సొము వీర్రాజు

బీజేపీ పదాధికారిగా రాష్ట్రం నుండి మరో సీనియర్ నేతకు అవకాశం దక్కనుంది. తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవిలో ఇప్పటివరకు కొనసాగిన లక్ష్మణ్, ఎంపీ అరవింద్, మాజీ మంత్రులు డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిల పేర్లు కూడ ప్రచారంలో ఉన్నాయి.

టీడీపీ నుండి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావును రాజ్యసభకు పంపే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.

ఈ మేరకు తెలంగాణపై దృష్టిని కేంద్రీకరించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొంది. ఈ ఫలితాలు కూడ ఆ పార్టీ జాతీయ నాయకత్వంపై ఆశలు కల్గించాయి.