అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమించారు. ఈ పదవి నుండి కన్నా లక్ష్మీనారాయణను తొలగించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వీర్రాజును నియమిస్తున్నట్టుగా  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.

2014 అక్టోబర్ 27న అమిత్ షా సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు.. పార్టీలో  చేరిన తర్వాత 2018 మే లో ఆయనను బీజేపీ ఏపీ చీఫ్ గా నియమించింది కమలదళం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికలు పూర్తైన తర్వాత  తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వాన్ని బీజేపీ మార్చింది. ఏపీ రాష్ట్రంలో మాత్రం నాయకత్వాన్ని మార్చలేదు. అయితే ఏపీ రాష్ట్రంలో పలువురి పేర్లను పార్టీ జాతీయ నాయకత్వం పరిశీలించింది.

చివరకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైపే  బీజేపీ నాయకత్వం మొగ్గు చూపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ వీర్రాజును నియమిస్తూ నియామకపత్రాలు పంపారు. సోము వీర్రాజుకు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఏపీ రాష్ట్రంలో టీడీపీతో బీజేపీతో పొత్తు ఉన్న సమయంలో కూడ ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడ సోము వీర్రాజు తీవ్రంగా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల గవర్నర్ కు పాలనా వికేంద్రీకరణ బిల్లులు, సీఆర్‌డీఏ బిల్లుల విషయంలో గవర్నర్ కు లేఖ రాయడంపై బీజేపీ కేంద్ర నాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసిందనే వార్తలు వచ్చిన తర్వాత సోము వీర్రాజుకు బీజేపీ ఏపీ చీఫ్ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకొంది.