UP Assembly Election 2022: కేసీఆర్ భారీ స్కెచ్... ప్రధాని ఇలాకాలో టీఆర్ఎస్ ప్లెక్సీలతో రాజకీయం వ్యూహం
బిజెపి టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ యూపీ ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచాారం చేయనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో భారీ ప్లెక్సీలు, హోర్డింగ్స్ వెలిసాయి.
వారణాసి: బిజెపి (bjp)ని టార్గెట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు రాష్ట్రంలో బద్దశత్రువైన కాంగ్రెస్ పార్టీకి కూడా జాతీయ స్థాయిలో దగ్గరయ్యేందుకు సిద్దమయ్యారు. ఇలా కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలో రాకుండా చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల (uttar pradesh election) వేళ ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ఇలాకా వారణాసి (varanasi)లో కేసీఆర్ భారీ ప్లెక్సీలు, హోర్డింగ్స్ వెలిసాయి. దీంతో ఇటు తెలంగాణలోనే కాదు అటు యూపీలోనూ ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుండి ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటిది అక్కడే కేసీఆర్ ప్లెక్సీలు వెలియడంతో రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ భారీ హోర్డింగ్స్, ప్లెక్సీలు కేసీఆర్ అనుమతితోనే వెలిసినట్లు... వీటి వెనక పెద్ద రాజకీయ వ్యూహమే దాగివుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిజెపితోనే కాదు స్వయంగా ప్రధాని మోదీతోనే కేసీఆర్ యుద్దానికి సిద్దమయ్యారన్న సంకేతాలను దేశంలోని ప్రాంతీయ పార్టీలతో పాటు బిజెపియేతర పక్షాలకు పంపాలనేదే ఈ ప్లెక్సీల ఉద్దేశమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏడు విడతల్లో జరుగుతున్న యూపీ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఇవాళ(గురువారం) ఆరో దశ పోలింగ్ జరుగుతోంది. చివరగా ఏడో దశలో వారణాసి పరిధిలో ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే రేపు(శుక్రవారం) డిల్లీ సీఎం కేజ్రీవాల్ (kejriwal), పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ (mamatha benerjee), ఎన్సీపీ నేత శరద్ పవర్ (sharad pawar) తో పాటు సీఎం కేసీఆర్ కూడా వారణాసిలో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ శ్రేణులు వారణాసిలో ప్లెక్సీలు ఏర్పాటుచేసాయి.
అయితే కేసీఆర్ డిల్లీ పర్యటన రాజకీయాల కోసం కాదని వ్యక్తిగతమని తెలుస్తోంది. డిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు బిజెపిని వ్యతిరేకించే మరికొందరు నాయకులను కూడా కలిసేందుకే కేసీఆర్ డిల్లీ పర్యటనకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం డిల్లీలో వైద్యపరీక్షలు చేయించుకుంటున్నారు. గత మంగళవారం కేసీఆర్ దంత వైద్యం చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యురాలు పూనియా ఆయనకు చికిత్స చేశారు.
ఇక ఇవాళ (గురువారం) కేసీఆర్ కంటికి సంబంధించిన పరీక్షలను చేయించుకోనున్నారు. వాస్తవానికి బుధవారమే ఆయన కంటి పరీక్షలు చేయించుకోవాలని భావించినా నేత్ర వైద్య నిపుణుడు సచ్‌దేవ్ అందుబాటులో లేకపోవడంతో నేటికి వాయిదా పడింది. అలాగే కేసీఆర్ సతీమణి శోభ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నేటి కంటి పరీక్షల అనంతరం ముఖ్యమంత్రి దంపతులు తిరిగి హైదరాబాద్ రానున్నారు.
అంటే రేపు(శుక్రవారం) ఆయన వారణాసిలో ప్రచారానికి వెళ్లడంలేదన్న మాట. అయితే కేసీఆర్ వారణాసిలో ప్రచారానికి వెళ్లకున్న ఇప్పటికే స్వాగతం పలుకుతూ వెలిసిన ప్లెక్సీలు, హోర్డింగ్స్ ఆయన బిజెపిని ఎంతలా వ్యతిరేకిస్తున్నారో తెలియజేసాయి. ఏకంగా ప్రధాని ఇలాకాలోనే వెలిసిన ప్లెక్సీలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసాయి.