డేటా లీక్ కేసులో సైబరాబాద్ పోలీసుల నుంచి కేంద్ర హోంశాఖ వివరాలు ఆరా తీసింది. 20 ప్రముఖ వెబ్‌సైట్లు కూడా డేటా అమ్మినట్లు గుర్తించామని సిట్ అధికారులు చెప్పారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా లీక్ కేసులో కేంద్ర హోం శాఖ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా సైబరాబాద్ పోలీసుల నుంచి వివరాలు ఆరా తీసింది. అలాగే డేటా లీక్‌ను అరికట్టేందుకు పలు సూచనలు చేసింది కేంద్రం. కాగా.. పాలసీ బజార్, బిగ్ బాస్కెట్, హెచ్‌డీఎఫ్‌సీలు తమ డేటా లీకైనట్లు తెలిపాయని సిట్ వెల్లడించింది. ఇప్పటి వరకు రూ. 80 కోట్ల విలువైన డేటా లీకైనట్లు పేర్కొంది. మార్కెటింగ్ కంపెనీలే ఈ డేటాను కొనుగోలు చేసినట్లు సిట్ తెలిపింది. సైబర్ నేరాలకు పాల్పడేందుకు మరికొందరు కొంటున్నారని పేర్కొంది. 20 ప్రముఖ వెబ్‌సైట్లు కూడా డేటా అమ్మినట్లు గుర్తించామని సిట్ అధికారులు చెప్పారు.
మరోవైపు.. డేటా లీక్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వినయ్ భరద్వాజ్ దాదాపు 66 కోట్ల మంది వ్యక్తిగత డేటా అమ్ముకున్నట్లుగా సిట్ అనుమానిస్తోంది. వివిధ కంపెనీల నుంచి ఈ డేటాను అతను సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇందులో 11 సంస్థల ప్రమేయం ప్రముఖంగా వుండటంతో ఆయా కంపెనీలకు సిట్ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థల ప్రతినిధులను రేపటి నుంచి విచారించనుంది. అటు డేటా లీక్ వ్యవహారంపై కేంద్ర హోం, ఐటీ మంత్రిత్వ శాఖలు సైతం ఆరా తీస్తున్నాయి. అత్యంత సున్నితమైన డేటా కావడంతోనే కేంద్రం సైతం భయాందోళనలు వ్యక్తం చేస్తోంది.
Also Read: డేటా లీక్ కేసులో సంచలన విషయాలు.. 66 కోట్ల మంది సమాచారం విక్రయం, ఆ 11 కంపెనీల పాత్రపై విచారణ
కాగా.. డేటా లీక్ కేసు దర్యాప్తులో భాగంగా 11 కంపెనీలకు నోటీసులు జారీ చేసింది సిట్. సెక్షన్ 91 కింద ఈ నోటీసులు జారీ చేశారు . వ్యక్తిగత సమాచారం గోప్యతపై వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బిగ్ బాస్కెట్ , ఫోన్ పే, ఫేస్‌బుక్, క్లబ్ మహేంద్ర, టెక్ మహేంద్ర, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, యాసిట్ గ్రూప్, మ్యాట్రిక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర సంస్థలు ఈ నోటీసులు వెళ్లాయి.
