సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన డేటా లీక్ కేసుకు సంబంధించి రేపటి నుంచి 11 కంపెనీల ప్రతినిధులను విచారించనున్నారు పోలీసులు. అటు డేటా లీక్ వ్యవహారంపై కేంద్ర హోం, ఐటీ మంత్రిత్వ శాఖలు సైతం ఆరా తీస్తున్నాయి.  

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా లీక్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వినయ్ భరద్వాజ్ దాదాపు 66 కోట్ల మంది వ్యక్తిగత డేటా అమ్ముకున్నట్లుగా సిట్ అనుమానిస్తోంది. వివిధ కంపెనీల నుంచి ఈ డేటాను అతను సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇందులో 11 సంస్థల ప్రమేయం ప్రముఖంగా వుండటంతో ఆయా కంపెనీలకు సిట్ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థల ప్రతినిధులను రేపటి నుంచి విచారించనుంది. అటు డేటా లీక్ వ్యవహారంపై కేంద్ర హోం, ఐటీ మంత్రిత్వ శాఖలు సైతం ఆరా తీస్తున్నాయి. అత్యంత సున్నితమైన డేటా కావడంతోనే కేంద్రం సైతం భయాందోళనలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు గాను వినయ్ భరద్వాజ్‌ను తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా సిట్ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. 

కాగా.. డేటా లీక్ కేసు దర్యాప్తులో భాగంగా 11 కంపెనీలకు ఆదివారం నోటీసులు జారీ చేసింది సిట్. సెక్షన్ 91 కింద ఈ నోటీసులు జారీ చేశారు . వ్యక్తిగత సమాచారం గోప్యతపై వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బిగ్ బాస్కెట్ , ఫోన్ పే, ఫేస్‌బుక్, క్లబ్ మహేంద్ర, టెక్ మహేంద్ర, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, యాసిట్ గ్రూప్, మ్యాట్రిక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర సంస్థలు ఈ నోటీసులు వెళ్లాయి. 

ALso REad: డేటా లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. 11 కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల నోటీసులు

ఇదిలావుండగా.. దేశంలోని 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. 24 రాష్ట్రాల్లోని 8 మెట్రోపాలిటిన్ నగరాల్లలో డేటా చోరీ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వినయ్ భరద్వాజ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా చోరీ కోసం 6 మెట్రోపాలిటీన్ నగరాల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు వినయ్.

డీమార్ట్, నీట్, పాన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, జీఎస్టీ, ఆర్టీవో, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, ఇన్‌స్టాగ్రామ్, జోమాటో, పాలసీ బజార్, బైజూస్ , వేదాంత , ఇన్‌కం ట్యాక్స్, డిఫెన్స్ అధికారులతో పాటు 9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల డేటాను ఈ గ్యాంగ్ చోరీ చేసినట్లుగా గుర్తించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 4 కోట్ల మంది డేటాను చోరీ చేయగా.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 2.5 కోట్ల మంది, హైదరాబాద్ నగరానికి చెందిన కోటి మంది డేటాను వినయ్ భరద్వాజ్ చోరీ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.