Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పసిబిడ్డపైనా రూ. లక్ష అప్పు, రాష్ట్రాలు లెక్క చెప్పాల్సిందే : కేసీఆర్‌పై నిర్మల విమర్శలు

బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్‌లో చాలా అప్పులు చూపించడం లేదని... బయట తీసుకునే వాటిని శాసనసభకు తెలియనివ్వడం లేదని నిర్మల ఆరోపించారు.
 

union minister nirmala sitharaman fires on telangana cm kcr
Author
First Published Sep 1, 2022, 8:06 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల్లోకి నెట్టేశారని ... రాష్ట్రంలో అప్పుడే పుట్టినబాబు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్ధితి వుందన్నారు. ఉపాధి హామీ పథకం కోసం 20 వేల కోట్లు ఇచ్చామని... కేంద్రం పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారని ఆమె హెచ్చరించారు. ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుందని.. తానే ప్రధాని అన్నట్లు కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని నిర్మల ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారని.. లాభాల్లో వున్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారంటూ కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రతి ఒక్కటి అమల్లోకి రావాలని.. ప్రజలను భయపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని, మన వూరు - మన బడి కేంద్ర పథకం అయితే దానిని రాష్ట్ర స్కీమ్‌గా ప్రచారం చేసుకుంటున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి 100 మందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారని, ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో వుందని ఆమె వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో చాలా అప్పులు చూపించడం లేదని... బయట తీసుకునే వాటిని శాసనసభకు తెలియనివ్వడం లేదని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. రాష్ట్రం అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి వుందన్న ఆమె.. ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని తెలంగాణ దాటిపోయిందన్నారు. 

ALso REad:మాది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్, లీడరెవరో త్వరలో చెబుతాం : బీహార్‌లో కేసీఆర్ వ్యాఖ్యలు

ఇకపోతే..  బీహార్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లను కేసీఆర్ కలిశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. కనీసం ఒక్క రంగాన్నైనా బాగు చేశారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో మోడీ సర్కార్ చేసిందేమి లేదని.. డాలర్‌తో పోలీస్తే రూపాయి విలువ ఎప్పుడూ లేనంతగా పడిపోయిందన్నారు. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయని.. సామాన్యులు , రైతులు అంతా ఆందోళనలో వున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో పరిస్ధితులు ఘోరంగా మారుతున్నాయని.. దేశ రాజధాని ఢిల్లీలో నీళ్లకు , కరెంట్‌కు ఇంకా కొరత వుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. 

ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రం విఫలమైందని...మోడీ విధానాలతో దేశం నుంచి వ్యాపారులు పారిపోతున్నారని కేసీఆర్ ఆరోపించారు. దేశంలో నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయని.. ప్రధాని ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేరలేదని సీఎం పేర్కొన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే నినాదం ఏమైందని.. జాతీయ జెండాతో సహా అన్నీ చైనా నుంచి దిగుమతి అవుతున్నాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మేక్ ఇన్ ఇండియా అంటే ఇదేనా.. బీజేపీ ముక్త్ భారత్‌ను సాధించాలని సీఎం పిలుపునిచ్చారు. నీతీశ్ కూడా బీజేపీ ముక్త్ భారత్ కావాలని కోరుకుంటున్నారని.. బీజేపీ వ్యతిరేకత శక్తుల్ని అంతా సంఘటితం చేయాలని కేసీఆర్ కోరారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం వుందని సీఎం ఆకాంక్షించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios