Asianet News TeluguAsianet News Telugu

మాది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్, లీడరెవరో త్వరలో చెబుతాం : బీహార్‌లో కేసీఆర్ వ్యాఖ్యలు

బీహార్ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమది థర్డ్ ఫ్రంట్ కాదని , మెయిన్ ఫ్రంట్ అన్నారు. అమెరికా ఎన్నికల్లో మోడీ వేలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం ప్రశ్నించారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం ఎందుకు చేశారని కేసీఆర్ నిలదీశారు. 

telangana cm kcr key comments on third front at bihar visit
Author
First Published Aug 31, 2022, 6:17 PM IST

తమది థర్డ్ ఫ్రంట్ కాదని , మెయిన్ ఫ్రంట్ అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.  బీహార్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లను కేసీఆర్ కలిశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. కనీసం ఒక్క రంగాన్నైనా బాగు చేశారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో మోడీ సర్కార్ చేసిందేమి లేదని.. డాలర్‌తో పోలీస్తే రూపాయి విలువ ఎప్పుడూ లేనంతగా పడిపోయిందన్నారు. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయని.. సామాన్యులు , రైతులు అంతా ఆందోళనలో వున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో పరిస్ధితులు ఘోరంగా మారుతున్నాయని.. దేశ రాజధాని ఢిల్లీలో నీళ్లకు , కరెంట్‌కు ఇంకా కొరత వుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. 

ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రం విఫలమైందని...మోడీ విధానాలతో దేశం నుంచి వ్యాపారులు పారిపోతున్నారని కేసీఆర్ ఆరోపించారు. దేశంలో నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయని.. ప్రధాని ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేరలేదని సీఎం పేర్కొన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే నినాదం ఏమైందని.. జాతీయ జెండాతో సహా అన్నీ చైనా నుంచి దిగుమతి అవుతున్నాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మేక్ ఇన్ ఇండియా అంటే ఇదేనా.. బీజేపీ ముక్త్ భారత్‌ను సాధించాలని సీఎం పిలుపునిచ్చారు. నీతీశ్ కూడా బీజేపీ ముక్త్ భారత్ కావాలని కోరుకుంటున్నారని.. బీజేపీ వ్యతిరేకత శక్తుల్ని అంతా సంఘటితం చేయాలని కేసీఆర్ కోరారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం వుందని సీఎం ఆకాంక్షించారు. 

ALso REad:బీహర్ కార్మికులు తెలంగాణ అభివృద్దికి ప్రతినిధులు: కేసీఆర్

చైనాతో పోలీస్తే మనం ఎక్కడ వున్నామన్న ఆయన.. బీజేపీ ముక్త్ భారత్ అయితేనే దేశం ముందుకు వెళ్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మోడీ అసమర్ధ విధానాలతో దేశం తిరోగమన దిశలో వెళ్తోందని... ధర్మం పేరుతో దేశంలో వైషమ్యాలు తీసుకొస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్ని కేంద్రం ఇబ్బంది పెడుతోందని.. దేశంలో వినాశకరమైన పరిస్ధితిని బీజేపీ తీసుకొచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. అన్ని పార్టీలను తుడిచి పెడతామని బీజేపీ నేతలు అంటున్నారని.. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్ట్‌లు అన్నీంటినీ అమ్మేస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు. అన్నీ అమ్మేసుకుంటూ పోతే ఏం మిగులుతుందన్న ఆయన.. బేచో ఇండియా అనేదే వాళ్ల పాలసీ అని కేసీఆర్ చురకలు వేశారు. బీజేపీలో అంతా సత్యహరిశ్చంద్రులే వున్నారా .. అమెరికా ఎన్నికల్లో మోడీ వేలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం ప్రశ్నించారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం ఎందుకు చేశారని కేసీఆర్ నిలదీశారు. 

బీజేపీ ముక్త్ భారత్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని.. బీజేపీ వ్యతిరేక కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారనే దానిపై తొందర వద్దన్నారు. విస్తృతంగా చర్చ జరిగాక నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటామని.. బీజేపీకి వ్యతిరేకంగా అందరమూ ఒక్కతాటిపై వున్నామని కేసీఆర్ తెలిపారు. విద్యుత్ చట్టం తీసుకురావడం వెనుక పెద్ద కుట్ర వుందని సీఎం ఆరోపించారు. భూముల్ని కూడా కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. తమతో కలిసి వచ్చే వారితో కలిసి నడుస్తామని.. రాని వారిని విడిచిపెట్టి వెళ్తమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రైవేట్‌లో బొగ్గు కొనాలని ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ అనేది వందకు వంద శాతం ఫ్లాప్ మోడల్ లని సీఎం చురకలు వేశారు. మాది థర్డ్ ఫ్రంట్ కాదన్న ఆయన.. మెయిన్ ఫ్రంట్ అని స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios