హైదరాబాద్: టీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకి ఓటేసినట్టేనని తాము చెప్పిన మాటలు రుజువయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంపై ఆయన స్పందించారు. 

ఎన్నికల సమయంలో తాము చేసిన ప్రచారం నిజమైందన్నారు.ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకోవడం  ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనంగా పేర్కొన్నారు.

టీఆర్ఎస్, ఓవైసీ కుటుంబాలను వేర్వేరుగా చూడాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రగతి భవన్ లో జరగడం లేదని.. ఈ నిర్ణయాలన్నీ దారుసలాంలో జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని తాము చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 

also read:ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీయా?: తలసాని ఫైర్

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. ఆ పార్టీకి మెజారిటీ లేనందున ఆ పార్టీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతును ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తమకు డిప్యూటీ మేయర్ పదవిని ఇస్తామని టీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చిందని.. ఈ ఆఫర్ కు ధన్యవాదాలు అంటూ ఎంఐఎం చీఫ్, హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అసద్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాను స్పందించబోనని ఆయన చెప్పారు.