తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి అధ్యక్ష మార్పు ఖాయమంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాారు.
వరంగల్ : తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ బిజెపిలోనూ జోరు తగ్గింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఇక సంజయ్ నాయకత్వంలో పనిచేసేందుకు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారు ఇష్టపడటం లేదట. అందువల్లే వారు అధ్యక్షున్ని మార్చాలని పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నారట. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన బిజెపి అదిష్టానం బండి సంజయ్ ను అధ్యక్ష పదవినుండి తప్పించే అవకాశాలున్నాయంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ బిజెపి అధ్యక్ష మార్పు ప్రచారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికిప్పుడు బిజెపి అధ్యక్షుడిని మార్చే అవకాశం లేదని... బండి సజయ్ ఆ పదవిలో కొనసాగుతారని కేంద్ర మంత్రి తెలిపారు. బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
ఇదిలావుంటే బండి సంజయ్ మాత్రం తాను అధ్యక్ష పదవిలో ఎక్కువరోజులు కొనసాగకపోవచ్చని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హన్మకొండలో బిజెపి నాయకులు, కార్యకర్తలో సంజయ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కొందరు నాయకులు బిజెపి అధ్యక్ష మార్పు ప్రచారంపై సంజయ్ తో ప్రస్తావించారు. దీంతో ప్రధాని సభకు బిజెపి అధ్యక్ష హోదాలో వస్తానో రానో తెలియదంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.
Read More ముంబైకి బండిసంజయ్.. అక్కడినుంచి ఢిల్లీకి...
సంజయ్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్న సమయంలో ఆయన డిల్లీకి వెళుతున్నారు. ఇవాళ ముంబైకి వెళుతున్న సంజయ్ ముంబాదేవిని దర్శించుకోనున్నారు. అక్కడి నుండే సంజయ్ దేశ రాజధాని డిల్లీకి వెళ్లనున్నారు. నిన్న అధ్యక్ష మార్పుపై సంజయ్ వ్యాఖ్యలు... ఇవాళ హటాత్తుగా ముంబై, డిల్లీ పయనం నేపథ్యంలో తెలంగాణ బిజెపిలో మార్పులు ఖాయమని అర్థమవుతోంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్ష మార్పు వుండదని అనడంతో తెలంగాణ బిజెపిలో అసలేం జరుగుతుందో అర్థంకావడం లేదు. మరోవైపు బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో కీలక భేటీ జరగనుంది. ఈ మీటింగ్ కు ఈటల రాజేందర్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ రానున్నారు. ఇటీవల బీజేపీ నేత జితేందర్ రెడ్డి స్వపక్షంపై చేసిన ట్వీట్ బిజెపిలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మీటింగ్ జరగనుండడంతో ఈ మీటింగ్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక బీజేపీ అసంతృప్త నేతలు ఎమ్మెల్యే రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.
