Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ హాస్టల్స్‌లో దారుణ పరిస్ధితులు.. మీ మనవడిని వుంచితే తెలుస్తుంది :కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫాం హౌస్‌లో ప్రగతి భవన్‌లో మాత్రమే వెలుగు వుందని.. ప్రజల ఇళ్లలో కాదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

union minister kishan reddy counter to telangana cm kcr
Author
First Published Jan 18, 2023, 7:33 PM IST

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించిన ఘనత మోడీదేనన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచి , కరెంట్ కోతలు నివారించామని కిషన్ రెడ్డి తెలిపారు. రక్షణ రంగంలో 2014 నాటికి 900 కోట్లుగా వున్న ఎగుమతుల్ని.. ఇవాళ రూ.15 వేల కోట్లకు చేర్చడమే కాకుండా, 71 దేశాలకు ఎగుమతి చేస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. దేశంలో 100 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలనే లక్ష్యంలో భాగంగా ఇటీవల సికింద్రాబాద్ - విశాఖ మధ్య రైలును ప్రారంభించామని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా సొంత టెక్నాలజీతో దీని నిర్మాణం చేపట్టామని ఆయన తెలిపారు. 

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారని దాని సంగతి ఏమైందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని.. కేంద్రం నిర్మించకపోతే తామే నిర్మిస్తామని కేసీఆరే హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి చురకలంటించారు. పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న మాట నిజమేనని అంగీకరించిన కిషన్ రెడ్డి.. దానిని తగ్గించాలనే ఉద్దేశంతో 12000 కోట్లు కేటాయించామన్నారు . పామాయిల్ రైతులకు ఇన్సెంటివ్‌లు, కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లను నెలకొల్పి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. 

ALso REad: అగ్నిపథ్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణల రద్దు, ఎల్‌ఐసీకి అండ .. బీఆర్ఎస్ లక్ష్యాలివే : ఖమ్మం సభలో కేసీఆర్

జల వివాదాల మీటింగ్‌లకు కేసీఆర్ డుమ్మా కొడుతూ వుంటారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుంటే సమస్య దానంతట అదే పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యుల కోసమే కేసీఆర్ అంతరాత్మ వుందని.. అధికారం పోకూడదు, తనయుడు సీఎం కావాలని ఆ ఆత్మ కోరుకుంటోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. రాజకీయంగా బీజేపీని విమర్శించిన పర్లేదు కానీ, దేశాన్ని మాత్రం విమర్శించొద్దని ఆయన హితవు పలికారు. గతంలో ఎయిరిండియాకు ప్రతి నెలా 800 కోట్ల నష్టం వచ్చేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అందుకే అందరికీ ఆమోదయోగ్యంగా టాటా కంపెనీకి ఇచ్చామని మంత్రి తెలిపారు. ఎయిరిండియా ఉద్యోగస్తులు, భారతీయులు దానికి ఆమోదముద్ర వేశారని ఆయన వెల్లడించారు. 

ఎయిరిండియా కాంగ్రెస్ హయాంలోనే నష్టపోయిందని.. అప్పట్లో సంస్థ ఉద్యోగి బాధతో, భయంతో పడుకునేవాడని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం ధైర్యంగా గుండెలపై చేయి వేసుకుని నిద్రపోతున్నాడని ఆయన స్పష్టం చేశారు. సైనికులు, దేశాన్ని అవమానించడం కేసీఆర్‌కు అలవాటైపోయిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. జీతాలు ఇవ్వలేని పరిస్ధితుల్లో కేసీఆర్ వున్నారని, తెలంగాణ దివాళా తీసిందని ఆరోపించారు. ప్రస్తుతం కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని.. నిరుద్యోగ భృతి, దళిత బంధు, గిరిజన బంధు ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని.. 9 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే వున్నారని కిషన్ రెడ్డి చురకలంటించారు. 

కేసీఆర్ సీఎం హోదాలో వుండి దేశాన్ని అవమానిస్తున్నారని.. హాస్టళ్లలో పిల్లలు సంతోషంగా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం బాగోదని, ఇప్పటికే పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.  మీ మనవడిని నెల రోజులు హాస్టల్‌లో వుంచితే పిల్లల కష్టాలేంటో తెలుస్తాయన్నారు. ఫాం హౌస్‌లో ప్రగతి భవన్‌లో మాత్రమే వెలుగు వుందని.. ప్రజల ఇళ్లలో కాదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. కల్వకుంట్ల కుటుంబానికి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios