Asianet News TeluguAsianet News Telugu

అగ్నిపథ్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణల రద్దు, ఎల్‌ఐసీకి అండ .. బీఆర్ఎస్ లక్ష్యాలివే : ఖమ్మం సభలో కేసీఆర్

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రద్దు చేస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 150 మంది మేధావులు బీఆర్ఎస్ విధానాలను రూపొందిస్తున్నారని ఆయన తెలిపారు. 

telangana cm kcr speech at brs formation public meeting in khammam
Author
First Published Jan 18, 2023, 5:44 PM IST

ఖమ్మం చరిత్రలో ఈ స్థాయి సభ ఎన్నడూ జరగలేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఆయన మాట్లాడుతూ.. మీరు ఓపికతో వున్నారంటేనే దేశంలో ప్రబల మార్పు కోరుకుంటున్నారని సంకేతమన్నారు. దేశంలో విచిత్రమైన పరిస్థితి వుందని .. రాజకీయాల్లోకి ఎంతో మంది వచ్చారు, పోయారని కేసీఆర్ దుయ్యబట్టారు. భారతదేశం దారి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పాలసీ ఏంటీ, వైఖరి ఏంటనే దానిపై వివరంగా చెబుతానని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో 1.40 లక్షల టీఎంసీల వర్షపాతం నమోదవుతోందన్నారు. ప్రపంచానికే ఫుడ్ చైన్ అందించిన దేశం ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు తింటుందోని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

సహజ సంపద మన దేశ ప్రజల సొత్తుని.. అమెరికా మనకంటే రెండు రెట్లు పెద్దదని, కానీ వారి వ్యవసాయం 29 శాతం మాత్రమేనని సీఎం పేర్కొన్నారు. లక్షల కోట్ల సంపద ఎవరి సొంతమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇండియాలో మామిడి కాయలే కాదు, యాపిల్ కాయలు పండుతాయని కేసీఆర్ తెలిపారు. భారతదేశం అన్ని విధాలా సుసంపన్నమైన దేశమని.. జలవనరులు, సాగు భూమి విషయంలో మనదేశమే అగ్రగామన్నారు. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో వున్నాయని.. కానీ కేవలం 20 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso REad: మోడీ కార్పోరేట్లకు తొత్తు..కేసీఆర్ పోరాటానికి అండగా వుంటాం : ఖమ్మం సభలో కేరళ సీఎం విజయన్

దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయిందని.. జింబాబ్వేలో 6 వేల టీఎంసీల సామర్ధ్యం గల రిజర్వాయర్ వుందని ఆయన తెలిపారు. చైనాలో 5 వేల టీఎంసీల సామర్ధ్యం గల రిజర్వాయర్ వుందని, మనదేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్ అయినా వుందని కేసీఆర్ చెప్పారు. దేశంలో చైతన్యం అందించేందుకు పుట్టిందే బీఆర్ఎస్‌ అని సీఎం తెలిపారు. బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చిందన్న ఆయన.. దేశ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీయే కారణమని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో వుంటే బీజేపీని తిడుతోందని.. బీజేపీ అధికారంలో వుంటే కాంగ్రెస్‌ను తిడుతోందని ఎద్దేవా చేశారు. 

దేశంలో 4.10 లక్షల కోట్ల మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యం వుందని.. ఎప్పుడూ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి వాడలేదన్నారు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. ఎన్‌పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారని.. తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. నష్టాలు సమాజానికి, లాభాలు ప్రైవేట్ వ్యక్తులకా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎల్ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా.. ఎల్ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు బీఆర్ఎస్‌ను బలపరచాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కరెంట్ కార్మికులారా..? పిడికిలి బిగించండి అంటూ కేసీఆర్ కోరారు. 

ALso Read: బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండే ప్రారంభం కావాలి: ఖమ్మం సభలో అఖిలేష్ యాదవ్

విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని.. దేశంలో ఇంకా లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం వుందన్నారు.  అవసరం వున్న చోట వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానమని.. దళితబంధును దేశమంతా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నానని కేసీఆర్ అన్నారు. మీరు ఇవ్వకపోతే తాము దేశమంతా దళితబంధు ఇస్తామన్నారు. దేశంలో మతపిచ్చి లేపుతున్నారని.. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్ధితుల్లనూ ప్రైవేట్ పరం కానివ్వమని కేసీఆర్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును మోడీ అమ్మితే తాము అధికారంలోకి వచ్చాక కొంటామని ఆయన తెలిపారు. లొడ లొడ మాట్లాడే ప్రధానికి మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా, జోక్ ఇన్ ఇండియాగా మారిందన్నారు. అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని.. కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ విధానాలు ప్రజల ముందుంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. 150 మంది మేధావులు బీఆర్ఎస్ విధానాలను రూపొందిస్తున్నారని సీఎం తెలిపారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios