హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపినట్టుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  శుక్రవారం నాడు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

also read:శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అదుపులోకి మంటలు: 9 మంది ఉద్యోగుల ఆచూకీ కోసం గాలింపు

ఈ ప్రమాదంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.ప్రమాదంలో గాయపడినవారంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో  గురువారం నాడు అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం వాటిల్లినట్టుగా అధికారులు చెబుతున్నారు. 

ప్రమాదం జరిగిన విషయం తెలిసిన తర్వాత విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు లు శ్రీశైలం చేరుకొన్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే 9 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం నాడు ఉదయానికి మంటలు అదుపులోకి వచ్చినట్టుగా అగ్నిమాపక సిబ్బంది ప్రకటించారు.