శ్రీశైలం: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మంటలు అదుపులోకి వచ్చినట్టుగా అగ్నిమాపక సిబ్బంది శుక్రవారం నాడు ప్రకటించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మంటల్లో చిక్కుకొన్న 9 మంది విద్యుత్ సిబ్బంది ఆచూకీ తెలియాల్సి ఉందని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు.

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారంనాడు అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కొందరు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

also read:శ్రీశైలం విద్యుత్కేంద్రం ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో 4వ యూనిట్ టర్మినల్ లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్యానెల్ బోర్డులో భారీగా పేలుడు వాటిల్లినట్టుగా అధికారులు చెబుతున్నారు. జీరో లెవల్ నుండి  సర్వీస్ బే వరకు పొగ అలుముకొంది. 

అగ్నిమాపక వాహనాలు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లడానికి సుమారు 20 నిమిషాలు పడుతోందని ఫైర్ సిబ్బంది చెప్పారు. మంటల్లో చిక్కుకొన్న 9 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సింగరేణి రెస్క్యూ టీమ్ కూడ సంఘటన స్థలానికి చేరుకొంది. ప్రమాదంలో చిక్కుకొన్న 9 మంది ఉద్యోగుల  కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం వాటిల్లినట్టుగా ఫైర్ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.