సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ కు చెందిన ఎరువుల వ్యాపారి ఉదయ్ కుమార్ రెడ్డి హత్య కేసును కొమురవెల్లి పోలీసులవు ఛేదించారు. 72 గంటల్లో వారు ఈ కేసును ఛేదించారు. ఉదయ్ కుమార్ రెడ్డి మరదలి మేనబావ, అతిని మిత్రుడు ఈ కేసులో నిందితులని తేల్చారు. 

మంగళవారం మీడియా సమావేశంలో హుస్నాబాద్ ఏసీపీ ఆ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉదయ్ కుమార్ రెడ్డి 8 ఏళ్ల క్రితం యాదాద్రి- భువనగిరి జిల్లా ఆలేరు మండలం కాశీనగర్ కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

Also Read: ప్రేయసిని చంపి శవాన్ని సూట్ కేసులో కుక్కి మరో మహిళతో పరారీ

ఆ తర్వాత తన భార్య చెల్లెలిని తీసుకుని వెళ్లి చదివించాడు. ఆమె తన మామ రెండో భార్య కూతురు. ఆమెను గొర్రెంకుల బాలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అప్పటికే బాలుకు రెండు పెళ్లిళ్లు జరిగి పెటాకులయ్యాయి కూడా. 

ఉదయ్ కుమార్ వల్ల ఆమె తనకు దూరమవుతోందని బాలు కక్ష పెంచుకున్నాడు. అతన్ని అడ్డు తొలగించుకోవాలని కుట్ర చేశాడు. తన మిత్రుడు చౌదరిపల్లి పరశురాములు సహాయం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి ఈ నెల 23వ తేదీన ఉదయ్ కుమార్ కు ఫోన్ చేసి మందుపార్టీకి పిలిచారు. 

కొడవటూరు గ్రామ శివారులో ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అక్కడ ఉదయ్ కుమార్ ను చంపాలని అనుకుంటే వీలు కాలేదు. దాంతో చేర్యాలలో మరో సారి మద్యం కొనుగోలు చేసి వేచరేణి శివారులో ఉదయ్ కుమార్ కు తాగించారు. అక్కడ బాలు, పరశురాములు కలిసి గొంతు కోసి అతన్ని చంపాలని అనుకున్నారు. 

వారి కుట్రను పసిగట్టిన ఉదయ్ కుమార్ అక్కడి నుంచి పరుగు తీశాడు. దాంతో బాలు అతడిని కారులో అనుసరించి వేగంగా ఢీకొట్టాడు. దాంతో ఉదయ్ కుమార్ మరణించాడు. ఆ తర్వాత బాలు, పరశురాములు అక్కడి నుంచి పరారయ్యారు.