డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. బీహార్ కు చెందిన ఓ వ్యక్తి తన ప్రేయసిని చంపాడు. ఆమె శవాన్ని సూట్ కేసులో కుక్కాడు. ఆ తర్వాత మరో మహిళతో పారిపోయాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అయితే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఆపార్టుమెంట్ లోని ఫ్లాట్ కు బయటి నుంచి తాళం వేసి ఉంది. అయితే, లోపలి నుంచి దుర్వాస వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఆ సంఘటన వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ కు చెందిన బాధితురాలు (23), నిందితుడు (26) హరిద్వార్ లోని ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. 

నిందితుడు బీహార్ లోని వైశాలి జిల్లాకు చెందినవాడని హరిద్వార్ ఎస్పీ కమలేష్ ఉపాధ్యాయ చెప్పారు. హతురాలికి, నిందితుడికి మధ్య చాలా కాలంగా పరిచయం ఉందని చెప్పారు. గ్వాలియర్, ఢిల్లీల్లో ఒకే చోట వారు పనిచేశారని, దాంతో వారి మధ్య పరిచయం పెరిగి సహజీవనానికి దారి తీసిందని చెప్పారు 

నిరుడు డిసెంబర్ లో వారిద్దరు పనిచేసిన సంస్థకు చెందిన సిబ్బందితో కలిసి హరిద్వార్ లోని ఓ కంపెనీలో చేరారు. వారంత కంపెనీ సమీపంలోనే నివసిస్తున్నారు. నిందితుడు తాము నివాసం ఉంటున్న భవనంలోని మరో మహిళతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నాడు. 

దాంతో నిందితుడికి, హతురాలికి మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. శుక్రవారంనాడు ఇరువురి మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఆ గొడవలో నిందితుడు మహిళ గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని సూట్ కేసులో కుక్కి పారిపోయాడు. అదే భవనంలోని మరో మహిళ కూడా కనిపించకుండా పోవడంతో నిందితుడితో కలిసి అతను పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. పారిపోయిన ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ ఉపాధ్యాయ చెప్పారు.