ఇద్దరు ప్రాణస్నేహితులు ఒకేసారి, ఒకే గదిలో ఆత్మహత్య చేసుకోవడం హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ లో కలకలం రేపింది.
హైదరాబాద్ : ప్రాణస్నేహితులు ఇద్దరూ ఒకే గదిలో, ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. అద్దె గదిలో ఒకరు ఉరేసుకుని, మరొకరు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు యువకుల కుటుంబాల్లో విషాదం నిండింది.
యువకుల ఆత్మహత్యలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా ఘనపూర్ కు చెందిన నివాస్(19) ఘట్ కేసర్ సమీపంలోని ప్రిన్స్‌టన్ కాలేజీలో బీ-ఫార్మసీ చదువుతున్నాడు. అతడికి కొత్తగూడెం జిల్లాకు చెందిన సాయి గణేష్(21)తో మంచి స్నేహం వుంది. దీంతో నివాస్, సాయి ఓ గదిని అద్దెకు తీసుకుని కలిసి వుండేవారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడి ప్రాణ స్నేహితులయ్యారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్ళడం, ఎలాంటి విషయాలనైనా ఒకరికొకరు పంచుకోవడం... మొత్తంగా ఒకరు లేకుండా మరొకరు వుండలేనంతలా వారి స్నేహం బలపడింది.
అయితే హఠాత్తుగా ఏమయ్యిందో తెలీదుగానీ నిన్న(శనివారం) ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. అద్దెకుంటున్న గదిలోనే నివాస్ కేబుల్ సాయంతో ఫ్యాన్ కు ఉరేసుకోగా స్నానాల గదిలో సాయి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఎప్పుడు ఉరేసుకున్నారో తెలీదుగానీ... శనివారం ఇంటి యజమాని వీరి మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో స్నేహితుల ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది.
Read More బీభత్సం: గుండెనూ పొట్టను చీల్చి... మర్మాంగం కోసి...
ఘటనాస్థలికి చేరుకున్ని పోలీసులు నివాస్, సాయి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. గదిలోంచి నివాస్ రాసిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'నాకు చెడు అలవాట్లు వున్నాయి... అమ్మా నాన్న క్షమించండి' అంటూ నివాస్ సూసైడ్ లెటర్ లో రాసుకొచ్చాడు. ఒకేసారి ఇద్దరు స్నేహితుల ఇలా ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రాణ స్నేహితులిద్దరి మృతి వారి తల్లిదండ్రులకు కడుపుకోతకు గురిచేసింది. చేతికందివచ్చిన కొడుకులు ఇలా ఆత్మహత్యలకు పాల్పడటంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరిని ఓదార్చడం కుటుంబసభ్యుల వల్ల కూడా కావడం లేదు.
