హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అప్పా జంక్షన్ వద్ద ఓఆర్‌ఆర్‌పై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అప్పా జంక్షన్ వద్ద ఓఆర్‌ఆర్‌పై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పలువురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వద్ద ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న సమయంలో కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.