TTDP: ఆగ్రహంలో తెలుగు తమ్ముళ్లు.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటీ?
తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో లీడర్లు, క్యాడర్ తీవ్ర ఆగ్రహంలో ఉన్నది. అసలు రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ పైనా వారిలో నమ్మకాలు సడలుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలు ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమై భవితవ్యంపై చర్చలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేస్తుందని చాలా మంది అనుకున్నారు. నిజానికి జనసేన పై ఈ అంచనాలు లేవు. కానీ, ఇందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. టీటీడీపీ పోటీకి దూరంగా నిలవగా జనసేన బీజేపీతో పొత్తులో బరిలోకి దిగింది. టీడీపీ నేతలు చాలా కాలం నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. కానీ, టీడీపీ జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశలోకి జారుకున్నారు. టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ఏకంగా రాజీనామా చేసి బీఆర్ఎస్‌లోకి వెళ్లారు. ఇప్పటికీ టీటీడీపీకి అధ్యక్షులు లేరు. అసలు తెలంగాణలో టీడీపీ భవిష్యత్ ఏమిటీ? టీడీపీ ఫోకస్ మొత్తం ఏపీకే పరిమితం అవుతుందా? లేక తెలంగాణలోనూ పునర్నిర్మాణం అవుతుందా? అనేది ఆసక్తిగా మారింది.
ఈ సందేహాలు నెలకొన్న సందర్భంలో టీడీపీ ముఖ్య నాయకులు శనివారం సమావేశం అయ్యారు. ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నేతలు, పార్లమెంటు పార్టీ అధ్యక్షులు సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఈ సమావేశంలో టీటీడీపీ నేతలు భగ్గుమన్నారు. అధినాయకత్వంపై మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా నిలవడంపై ఆగ్రహించారు. అసలు పార్టీని ఏం చేయాలని అనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు.
Also Read: Hyderabad: ఒక రౌడీ షీటర్.. రూ. 100 కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టాడు? ఈడీ దర్యాప్తు
అసెంబ్లీ బరిలో నిలబడితే పార్టీ ప్రజల్లోకి వెళ్లేదని, వారిలో ఆదరణ ఉండేదని తెలుగు తమ్ముళ్లు అన్నారు. పోటీ చేయకుండా ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలంటే ఎలా? అని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ దుస్థితిలో ఉన్నదని, కనీసం పార్టీ అధ్యక్షులు లేక నెలలు గడుస్తున్నాయని ఫైర్ అయ్యారు. సమీప భవిష్యత్‌లో గ్రామ పంచాయతీ, మున్సిపల్, పార్లమెంటు, జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయని, వీటిలో పోటీపైనా స్పష్టత ఉండాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల్లోనే కాదు.. క్యాడర్‌లోనూ అపనమ్మకాలు ఏర్పడుతాయని, క్యాడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లినా వెళ్లుతుందని హెచ్చరించారు.
Also Read: CM Revanth Reddy: నడిరాత్రి నా ఇంటిపై లాఠీలు పడి.. నన్ను నిర్బంధించి.. : సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్
ఈ సమావేశం అనంతరం, పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త కంభంపాటి రామమోహన్ రావు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని అన్నారు. తెలంగాణలో టీడీపీ జెండా ఎగరేయడానికి నేతలంగా కలిసి పనిచేయాలని తీర్మానం చేశామని వివరించారు. పార్టీ బలోపేతానికి ఏం చేయాలనేదానిపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు.
Also Read: Potato: పొటాటో అంటే ఉల్లిగడ్డలే కదా!.. సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్.. ‘అది రాయలసీమ యాస’
తమకున్న పరిస్థితుల్లో పోటీ చేయలేకపోయామని చంద్రబాబు అరెస్టును టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ప్రస్తావించారు. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి రోడ్ మ్యాప్ రూపొందించుకోవడానికి సమావేశమయ్యామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదనే బాధ ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీకి భవిష్యత్ ఉంటుందనే నమ్మకంతో నాయకులు పని చేయడానికి సిద్ధమయ్యారని టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామా భూపాల్ రెడ్డి అన్నారు.