తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా టిడిపి పార్టీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం నాయకులతో సమావేశమయ్యాడు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఓ  వెలుగు వెలిగిన పార్టీని పూర్వ వైభవం దిశగా నడిపించాలని చంద్రబాబు తెలంగాణ నేతలకు సూచించారు. తెలంగాణలో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి తాను త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో పలువురు కీలక నేతలతో సమావేశమైన ఆయన, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని, ఏ నేతలు వలస వెళ్లినా నష్టం ఉండబోదని వారికి దైర్యం నింపారు.  క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కార్యకర్తలే పార్టీకి వెన్నుపూసలా నిలబడ్డారని వారిని కాపాడుకోవాలని నాయకులకు సూచించారు. 
అలాగే ఇటీవల మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమేనని చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఈ ప్రకటనపై చంద్రబాబు నాయకులతతో ఆరా తీసినట్లు సమాచారం. దీనిపై త్వరలో వ్యక్తిగతంగా అతడి వివరణ కోరనున్నట్లు చంద్రబాబు వారితో అన్నట్లు సమాచారం. 
ఈ సమావేశానికి తెలంగాణ అద్యక్షుడు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్, ఆర్ కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు.