Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ పరిధిలో ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. రెండు సరికొత్త ఆఫర్స్ ప్రకటన..

హైదరాబాద్ నగరంలో ప్రయాణికులుకు తెలంగాణ ఆర్టీసీ మరో రెండు సరికొత్త ఆఫర్‌లను తీసుకొచ్చింది. టీ-6, ఎఫ్-24 పేర్లతో ఈ ఆఫర్లను ప్రకటించింది. 

TSRTC launches two special offer tickets for affordable travel in Hyderabad
Author
First Published Mar 9, 2023, 4:18 PM IST

హైదరాబాద్ నగరంలో ప్రయాణికులుకు తెలంగాణ ఆర్టీసీ మరో రెండు సరికొత్త ఆఫర్‌లను తీసుకొచ్చింది. టీ-6, ఎఫ్-24 పేర్లతో ఈ ఆఫర్లను ప్రకటించింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప్ర‌యాణించేవారికి ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఈ టికెట్ల‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ గురువారం ఆవిష్క‌రించారు. టీ-24 మాదిరిగానే ఈ టికెట్లను కూడా ఆదరించాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులను కోరింది. 

ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. నగరంలో గతంలో ప్రవేశపెట్టిన టీ-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు. వారిలో 55.50 లక్షల మంది టీ-24 టిక్కెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. నగరంలోని ప్రయాణీకులకు, పర్యాటకులకు ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, సౌకర్యవంతంగా చేయడానికి టీ-6, ఎఫ్-24 టికెట్లను టీఎస్ఆర్టీసీ ప్రారంభించిందని తెలిపారు.

టీ-6 ఆఫర్ విషయానికి వస్తే.. ఇది మహిళలు, సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉంది. దీని ధరను రూ. 50గా నిర్ణయించారు. ఈ టికెట్ ద్వారా హైదరాబాద్ సబర్బన్ పరిమితుల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఆరు గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణించే వారికే ఇది వర్తించనుంది.

ఎఫ్-24 విషయానికి వస్తే..  ఇది కలిసి ప్రయాణించాలనుకునే కుటుంబం, స్నేహితుల సమూహాల కోసం రూపొందించబడింది. ఈ టిక్కెట్ ధర రూ. 300. ఈ టికెట్ ద్వారా హైదరాబాద్ సబర్బన్ పరిమితుల్లో వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాల్లో నలుగురితో కూడిన బృందం ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎఫ్-24 టిక్కెట్‌ను కొనుగోలు చేసినప్పటీ నుంచి 24 గంటల పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో  ప్రయాణించవచ్చు. ఈ టికెట్ శని, ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలిడ్సే‌లో మాత్రమే వర్తించనుంది.

ఇక, ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టీ-24 టికెట్‌ను ఆర్టీసీ సంస్థ అందజేస్తోంది. 24 గంటల పాటు ఆ టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. ఆ టికెట్‌ ధర పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ. 60గా ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios