హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దున్నపోతుమీద వర్షంకురిసినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

ఆర్టీసీని రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రభుత్వమే చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ఆర్టీసీ బాగుపడాలనే ఉద్దేశంతో స్వరాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన ఆర్టీసీ కార్మికుల కడుపుకొడుతున్నారంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కు చెందిన పత్రికలో ఆర్టీసీ బస్సులపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో ఎన్ని బస్సులు ఉన్నాయో, చత్తీస్ ఘడ్ లో అసలు బస్సులే లేవని పత్రికలో కథనాలు రాయించారని మండిపడ్డారు. 

ఎక్కడో ఉన్న రాష్ట్రాల గురించి కాదని కూతవేస్తే పలికే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 12వేల బస్సులు ఉన్నాయని ఆ విషయన్ని గుర్తుంచుకోవాలన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్ని బస్సులు ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు. 8కోట్ల మంది ప్రజలు ఉంటే 23వేల బస్సులు ఉన్నాయని గిన్నీస్ బుక్ రికార్డు సైతం సొంతం చేసుకుందని చెప్పుకొచ్చారు. 

తమిళనాడు రాష్ట్రంలో 7కోట్ల మంది ప్రజలకు గానూ 20వేల బస్సులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 4కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పదివేల బస్సులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.11వేల బస్సులు ఉండగా వాటి సంఖ్య 10వేలకు పడిపోయిందన్నారు. 

ప్రజారవాణా వ్యవస్థను బతికించాలంటే బస్సులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవలే ఆర్టీసీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆర్టీసీని బతికించేందుకు 50 శాతం బస్సులు ఆర్టీసీ, 30 శాతం ప్రైవేట్, 20 శాతం కాంట్రాక్ట్, స్టేజ్ క్యారియర్ బస్సులను తిప్పుతానని కేసీఆర్ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. 

ఆర్టీసీని ప్రైవేటీకరించబోమంటూనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులు నడిపించే ప్రక్రియపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందనడానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఆర్టీసీని అన్నంపెట్టకుండా చంపే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. 

ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయకుండా కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటికి ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదంటూ మండిపడ్డారు. 

1932లో నిజాం ఆర్టీసీని సంస్థాపించాడని చెప్పుకొచ్చారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూ.1600 కోట్లు సబ్సీడీగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. బొత్స సత్యనారాయణ హయాంలో డీజీల్ సబ్సిడీకింద రూ.300 కోట్లు ప్రకటించారని చెప్పుకొచ్చారు. 

ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2వేల కోట్ల బకాయిలను ఇప్పటికీ విడుదల చేయలేదని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం తరపు నుంచి తమను ఆదుకునేందుకు చర్యలు తీసుకుపోగా కేసీఆర్ తన డబ్బా పత్రికతో తప్పుడు వార్తలు రాయిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

కేసీఆర్ కార్యాలయంలో పనిచేసే పీఆర్వో జ్వాలా నరశింహారావుతో ఒక ప్రముఖ పత్రికలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాయడం కాదని ఎందుకు ఆర్టీసీని బతికించే ప్రయత్నం చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. 

ఆర్టీసీ నష్టాలకు ఉద్యోగులు బాధ్యత కాదన్నారు. కరీనంగర్ బహిరంగ సభలో ఆర్టీసీని విలీనం చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీని బలహీన పరిచాయని చెప్పుకొచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని తిట్టిపోశారు. 

తెలంగాణ ధనిక రాష్ట్రంగా ప్రకటించుకున్న కేసీఆర్ 31నెలలుగా ఆర్టీసీ కార్మికులకు పే స్కేలు ఆపేశారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం అనడంపై మండిపడ్డారు. 14 రోజుల మందు నోటీసులు జారీ చేశామని అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయంలో తాము ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సమ్మె చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. సకల జనుల సమ్మెలో మాత్రమే తాము అనుమతి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు జీతాలు ఇచ్చుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ సమ్మెకు అనుమతి తీసుకుంటామని చెప్తే కేసీఆర్ ఏం చెప్పారో తెలుసా అని చెప్పుకొచ్చారు. భయపెడితే కుక్క పరిగెట్టిస్తాది. రాళ్లు పట్టుకుని నిలబడితే పరిగెడతాది అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తమ సమ్మె చట్ట విరుద్ధమని విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. 

నీకన్నా చిన్నోడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతిని గుర్తు చేశారు. ఏపీలో కూడా ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా జగన్ విలీనం దిశగా అడుగులు వేస్తున్నాడని చెప్పుకొచ్చారు. మరి నువ్వెందుకు చేయవో చెప్పాలని నిలదీశారు. 

సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులపై కన్నేశాడని విమర్శించారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ ఆస్తులను కొందరికి కట్టబెట్టేందుకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.  46 బంకులకు ఒకే వ్యక్తికి కట్టబెట్టడం ఎంతవరకు సబబు అని నిలదీశారు.

ఇది ప్రజాస్వామ్యమా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ సొంత నిర్ణయాలపై గవర్నర్ తమిళసై సౌందర రాజన్ నోరెళ్లబెట్టారంటే ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుందని అశ్వత్థామరెడ్డి విమర్శించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రజలు తిరగడితే ఎవరూ ఏం చేయలేరు: కేసీఆర్‌ సర్కార‌్‌కు హైకోర్టు హెచ్చరిక

కేసీఆర్ సెల్ఫ్ గోల్, గులాబీ ఓనర్లు గప్ చుప్: అశ్వత్థామ రెడ్డి వెనక

ఒకదానిపై మరొకటి: కేసీఆర్ పై తమిళిసై మరో అస్త్రం