ఒకదానిపై మరొకటి: కేసీఆర్ పై తమిళిసై మరో అస్త్రం
తెలంగాణ సిఎం కేసీఆర్ పై ఇప్పటికే గవర్నర్ తమిళిసై ఓ అస్త్రం ప్రయోగించారు. ఆర్టీసీ సమ్మె రెండో అస్త్రం మాత్రమే. తెలంగాణలోని ఏడు విశ్వవిద్యాలయాలకు వీసీలు లేరు. ఇంచార్జీ విసీలకు తమిళిసై సౌందరరాజన్ నిధులపై ఆదేశాలు జారీచేశారు.
హైదరాబాద్: తాను అనుకున్నట్లు నడవదని, తాను తలుచుకుందే జరుగుతుందని ఇంక ఎంత మాత్రం అనుకోవడానికి వీలు లేని పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు వచ్చినట్లే ఉంది. ఊహించినట్లుగానే తెలంగాణ గవర్నర్ తమిళిసై చాలా చురుగ్గా కదులుతున్నారు.
ఆర్టీసీ సమ్మెపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తో మాట్లాడడం అటుంచితే, మరో పరిణామం కూడా కెసీఆర్ కు తలనొప్పిగానే ఉంది. ఇటీవల తమిళిసై తెలంగాణలోని ఏడు విశ్వవిద్యాలయాల ఇంచార్జీ వీసీలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా పూర్తికాలం వీసీ లేడు. వాటిని భర్తీ చేయడానికి తీసుకుంటున్న చర్యలేమిటో తెలియదు.
Also Read:సునీల్ శర్మ భేటీ: RTC కార్మికుల సమ్మెపై తమిళిసై రియాక్షన్ ఇదీ...
ఆ విషయం అలా ఉంచితే, రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్ష అభియాన్ (ఆర్ యూఎస్ఎ) కింద విశ్వవిద్యాలయాలకు కేసీఆర్ ప్రభుత్వం గ్రాంట్లను విడుదల చేయకపోవడాన్ని ఆమె గుర్తించారు. తెలంగాణలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కోసం ఆ నిధులను ఉద్దేశించారు.
ఆ పథకం కింద తొలుత రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేస్తేనే కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఇస్తుంది. ఇది నిబంధన. ఆ గ్రాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు మురిగిపోతాయి.
కనీసం అక్టోబర్ లోనైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేస్తేనే 2020 విద్యాసంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన నిధులను విడుదల చేస్తుంది. లేదంటే ఆ నిధులు మురిగిపోతాయి. ఆర్ యూఎస్ఎ ప్రాజెక్టు కింద ప్రత్యేకమైన ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: సునీల్ శర్మ భేటీ: RTC కార్మికుల సమ్మెపై తమిళిసై రియాక్షన్ ఇదీ...
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ గ్రాంట్ ను విడుదల చేయించుకోవడానికి చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై ఇంచార్జీ వీసీలను ఆదేశించారు. తక్షణమే చర్యలు తీసుకుని, ఆ నిధుల నుంచి తగిన ప్రయోజనం పొందాలని ఆమె ఆదేశించారు.