ఆర్టీసీ నీ జాగీరు కాదు, ఎవరికి ముగింపో ప్రజలే నిర్ణయిస్తారు: కేసీఆర్ కు అశ్వత్థామరెడ్డి వార్నింగ్
ఆర్టీసీ గానీ, యూనియన్లు గానీ ముగింపు అనేది అసాధ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్ వ్యవహరిచడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో ఎవరికి ప్రజలు ముగింపు పలుకుతారో తేలుతుందని అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ మునిగిపోతుందని కేసీఆర్ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగింపు ఎవరికో ప్రజలే నిర్ణయిస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.
ఆర్టీసీ ముగింపు అనడానికి అదేమీ ప్రభుత్వ జాగీరు కాదని చెప్పుకొచ్చారు అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ యూనియన్లకు ఎప్పుడూ ముగింపు ఉండదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికుల మనోభవాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు.
కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి నిదర్శనమన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రెస్మీట్లు పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదన్నారు.
ఆర్టీసీ కార్మికులపై నిర్లక్ష్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికులను ఆత్మహత్యలకు పురిగొల్పేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు ఇద్దరు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అలాగే కొందరు గుండెపోటుతో మరణించారని అవన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామన్నారు.
కేబినెట్ సమావేశం అవసరం లేకుండానే ఒక్క సతంతకంతో వేల బస్సులకు పర్మిట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పడంపై మండిపడ్డారు. తాను, మంత్రి కూర్చుని సంతకం పెడితే చాలంటావా ఇదేమైనా నీ జాగిరా లేక నీ ప్రభుత్వ జాగీరా అంటూ మండిపడ్డారు.
ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కరీంనగర్ సభలో ఏం చెప్పారో కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోతే ఎలా అని నిలదీశారు.
యూనియన్లు, కార్మికులు ఓట్లేస్తేనే సీఎం అయ్యావు: కేసీఆర్ పై అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ నష్టాలకు, సమ్మెకు కారణం యూనియన్ నేతలే కారణమన్న కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవే యూనియన్లు, ఈ ఆర్టీసీ కార్మికులే కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిని చేశాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని గట్టిగా చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సాధనలో భాగంగా సకలజనుల సమ్మె నీరుగార్చకుండా ఉండేందుకు ఆర్టీసీ యూనియన్లు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికితేనే ఉద్యమ నాయకుడివి అయ్యావని గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఈ యూనియన్ నాయకులే, ఈ ఆర్టీసీ కార్మికులే ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని కూడా కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెలో పాల్గొనడం వల్లే అది సక్సెస్ అయ్యిందని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు.
ఆర్టీసీకి ముగింపు అనేది లేదన్నారు. సూర్యచంద్రులు బతికి ఉన్నంతకాలం ఆర్టీసీ బతికే ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ గానీ, యూనియన్లు గానీ ముగింపు అనేది అసాధ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్ వ్యవహరిచడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో ఎవరికి ప్రజలు ముగింపు పలుకుతారో తేలుతుందని అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైకోర్టు ఏమైనా కొడతదా..? : సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ఠ్రాల్లో ఆర్టీసీ విలీనం చిచ్చు: జగన్ కమిటీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
TSRTC Strike: కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఆఫర్: విధుల్లో చేరాలని ఆదేశం
RTC strike: ఆర్టీసీ ఖతమ్: ఆర్టీసీ సమ్మెపై తేల్చేసిన కేసీఆర్
ఆర్టీసీ సమ్మె: బుద్ధిజ్ఞానం లేని సమ్మె ఇది, నాపై లంగ ప్రచారం చేస్తారా: కేసీఆర్