తెలంగాణ  ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - విజయవాడ రూట్‌లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి భారీ ఆఫర్ ప్రకటించింది.

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - విజయవాడ రూట్‌లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి భారీ ఆఫర్ ప్రకటించింది. 10 శాతం రాయితీ కల్పించనున్నట్టుగా తెలిపింది. హైదరాబాద్ - విజయవాడ రూట్‌లో టీఎస్‌ఆర్టీసీ.. సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ 10 శాతం తగ్గింపు ఏప్రిల్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ తగ్గింపు వల్ల హైదరాబాద్- విజయవాడ మార్గంలో టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఒక్కొక్కరికి రూ.40 నుంచి రూ.50 వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. 

ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను కోరారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. 

‘‘”విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్‌ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ మార్గం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లాలనుకుంటే.. వారి టికెట్‌లో విజయవాడ వరకు 10 శాతం రాయితీ కల్పించడం జరుగుతుంది. ఆ రాయితీ వల్ల ఒక్కో ప్రయాణికుడికి రూ.40 నుంచి 50 వరకు ఆదా అవుతుంది. ఈ నెల ౩౦ వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలి” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. ప్రయాణికులు రిజర్వేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtconline.com ను సంప్రదించాలని వారు సూచించారు.