TSPSC: టీఎస్‌పీఎస్‌సీలో ఏం జరుగుతోంది? ఐదుగురు బోర్డు సభ్యుల రాజీనామా.. ‘నేను ఎంతో క్షోభకు గురయ్యా’..
టీఎస్‌పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజే మరో కీలక అధికారి రాజీనామా చేశారు. జనార్దన్ రాజీనామాను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. తాజాగా బోర్డు సభ్యులు ఆర్ సత్యానారాయణ రాజీనామా చేసి..నిరుద్యోగుల కోసం ఓ లేఖ రాశారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ఎప్పుడూ హాట్ టాపికే. యువత దృష్టి, ముఖ్యంగా నిరుద్యోగుల ఆలోచనలు ఈ కమిషన్ చుట్టూ తిరుగుతుంటాయి. సమీప గతంలో ఈ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు రావడం, పరీక్షలు వాయిదాలు పడటం, లేదా కోర్టు కేసుల్లో చిక్కుకుని గందరగోళంలో పడ్డాయి. అందుకే ఈ కమిషన్ పరిణామాలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. నిన్న టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడం తవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం ఒకవైపు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచనలు చేస్తున్నదని మరో వార్త రావడం వంటివి ఈ విషయాలను మరింత సస్పెన్స్‌గా మార్చేశాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు TSPSCకి చెందిన ఇంకో కీలక అధికారి రాజీనామా చేశారు.
ఆర్ సత్యనారాయణతోపాటు మరో నలుగు బోర్డు సభ్యులు కూడా రాజీనామా చేశారు. బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్, కారెం రవీంద్ర రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేశారు.
టీఎస్‌పీఎస్‌సీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రత్యేకించి నిరుద్యోగులకు రాసిన లేఖలో తాను ఏ తప్పూ చేయలేదని, అయినా.. పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వివరించారు. కొత్త కమిషన్ ఆధ్వర్యంలో నియామకాలు జరగాలన్న నిరుద్యోగుల ఆకాంక్షను గౌరవిస్తున్నానని చెప్పారు. తాను ఎప్పుడూ నిరుద్యోగుల పక్షమే అని వివరించారు.
టీఎస్‌పీఎస్‌సీలో పేపర్ల లీకేజి అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు నిరుద్యోగులు ఎంత మానసిక ఆందోళనకు, ఆవేదనకు గురయ్యారో అర్థం చేసుకోగలనని ఆర్ సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు కమిషన్ బాధ్యులుగా తాము కూడా తీవ్ర మానసిక క్షోభ అనుభవించామని వివరించారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని, అనారోగ్యాలకు గురయ్యామని పేర్కొన్నారు.
పలువురు ఏకపక్షమై టీఎస్‌పీఎస్‌సీపై విమర్శలు చేస్తున్నారని, అసమర్థులమనే పరుష పదాలతో నిందిస్తున్నారని ఆయన తన లేఖలో వివరించారు. విచారణ లేకుండానే తామందరినీ దోషులుగా చిత్రించేశారని తెలిపారు. కమిషన్ సభ్యులుగా కొనసాగాలని, ఈ పదవులు పట్టుకుని వేలాడాలని తమకు లేదని, తెలంగాణ నిరుద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం అని వివరించారు. తాను, తన సహచరులు తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉధృతంగా పోరాడినవారిమేనని తెలిపారు.
Also Read: TSGENCO: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలి పోటీ పరీక్ష వాయిదా.. ఎందుకంటే?
ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఎస్‌పీఎస్‌సీలో తాను తన బాధ్యతను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు. అందుకే రాజీనామా చేసి తప్పుకుంటున్నానని వివరించారు. తాను రాజీనామా చేసినా.. నిరుద్యోగుల పక్షమే నిలబడతానని పేర్కొన్నారు.
కొందరు స్వార్థపరుల వల్ల అవాంఛనీయ ఘటన జరిగిందని, వీటి వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ రాజ్యాంగబద్ధ సంస్థ అని, అది రాజకీయాలతోపాటుగా మారిపోదని వివరించారు.