టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్: ఈ నెల 23న విచారణకు రావాలని రేవంత్ కు సిట్ నోటీసులు
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసుకు సంబంధించి ఈ నెల 23న విచారణకు రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులిచ్చారు సిట్ అధికారులు.
హైదరాబాద్:ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ అధికారులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సోమవారంనాడు నోటీసులు పంపారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన విమర్శల నేపథ్యంలో సిట్ అధికారులు ఇవాళ నోటీసులు ఇచ్చారు. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసలుు చేరుకున్నారు. హత్ సే హత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది.
ఇంట్లో రేవంత్ రెడ్డి లేకపోవడంతో సిట్ అధికారులు ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి, ఈ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డికి చెందిన మండలంలో గ్రూప్-1 పరీక్షల్లో వెయ్యి మంది ఉత్తీర్ణులయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై తమకు సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డిని సిట్ అధికారులు కోరే అవకాశం ఉంది. ఈ విషయమై విమర్శలు చేసిన రాజకీయ నాయకులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారం ఇవ్వాలని రాజకీయ నేతలను సిట్ అధికారులు కోరుతున్నారు.
టీఎస్‌సీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డికి తిరుపతికి మంది సంబంధాలున్నాయన్నారు. వీరిద్దరూ కూడా పక్క పక్క గ్రామాలకు చెందినవారేనని ఆయన చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు రాసిన వారికి తిరుపతి, రాజశేఖర్ రెడ్డి మండలానికి చెందిన అభ్యర్ధులకు మంచి మార్కులు వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి ఆరోపించారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ కార్యాలయం చక్కబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ మీడియా సమావేశం తర్వాత ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి రెండు మూడు రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు.
also read:వేధించేందుకే : సిట్ నోటీసులపై రేవంత్ రెడ్డి
ఈ కేసును విచారిస్తున్న సిట్ కు ఇంచార్జీగా ఉన్న ఏఆర్ శ్రీనివాస్ కు కేటీఆర్ బావమరిదికి సన్నిహిత సంబంధాలున్నాయని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు.