Asianet News TeluguAsianet News Telugu

లక్ష మందిని టెన్షన్ పెడుతున్న టిఎస్పిఎస్సీ

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ నిరుద్యోగ అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నది. కమిషన్ తీరు కారణంగా అభ్యర్థులు అయోమయంలో పడిపోతున్నారు. కమిషన్ వైఖరి కారణంగా చదవాలా వద్దా అన్న సందిగ్థంలో కొట్టుమిట్టాడుతున్నారు. అభ్యర్థులే కాకుండా వారి కుటుంబసభ్యులకు సైతం అవస్థలు తప్పడంలేదు. 

TSPSC creates undue tension among thousands of Gurukul job seekers

నిన్నమొన్నటి వరకు గ్రూప్ 2 విషయంలో టిఎస్పిఎస్సీకి అభ్యర్థులకు మధ్య పెద్ద వివాదం నడిచింది. ఇంకా నడుస్తూనే ఉన్నది. సమస్య  కోర్టు ముంగిట్లో ఉంది. తాజాగా గురుకుల ఉపాధ్యాయుల నియామకం విషయంలోనూ టిఎస్పిఎస్సీ నిరుద్యోగులతో చెలగాటమాడుతోంది. లక్ష మంది ఉపాధ్యాయ అభ్యర్థులు టిఎస్పిఎస్సీ  నిర్వాకం కారణంగా టెన్షన్ టెన్షన్ లైఫ్ ను అనుభవిస్తున్నారు. ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రిజల్ట్ రాకముందే మెయిన్స్ పరీక్ష తేదీని టిఎస్సీఎస్సీ వెలువరించింది. ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చి ఉంటే అర్హులెవరో, అనర్హులెవరో తేలిపోతుంది. తర్వాత అర్హులైన వారంతా మెయిన్స్  కు చదువుకుంటారు. అనర్హులైన వారు వారు తాము ఇంకేదైనా చదువుకోవడం కానీ, వేరే పనులు చేసుకోవడం కానీ చేసే వెసులుబాటు వారికి ఉంటుంది.

 

టిఎస్సిఎస్సీ వైఖరి వల్ల ఇప్పుడు సుమారు  లక్ష  మంది అభ్యర్థుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. మెయిన్స్ కు చదువుకోవాలా? లేక వేరే ఇంకేదైనా చూసుకోవాలా అన్న క్లారిటీ లేకుండా వారు ఆవేదన అనుభవిస్తున్నారు. అదే రిజల్ట్ ఇచ్చి మెయిన్స్ పరీక్షకు తేదీలు ప్రకటిస్తే అర్హులు మాత్రం  చదువుకుంటూ అనర్హులైన వారు తమకు కుదిరిన పనిచేసుకునే అవకాశం ఉండేది కదా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

 

గురుకుల టీచర్ పోస్టుల్లో టిజిటి, పిజిటికి కలిపి సుమారు లక్షా 25వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మే 31న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో సుమారు 85వేల మంది పరీక్ష రాశారు.

 

పిజిటి పోస్టులు నోటిఫికేషన్ ప్రకారం  అన్ని విభాల్లో కలిపి 921 భర్తీ చేయనున్నారు.

 

అంటే 921x 15 అనుకుంటే 13815 మంది అభ్యర్థులు ఈ కేటగిరీలో మెయిన్స్  అర్హత సాధిస్తారు.

 

టిజిటి పోస్టులు నోటిఫికేషన్ ప్రకారం 4362 భర్తీ చేయనున్నారు.

 

అంటే 4362 x 15 అంటే 65430 మంది మెయిన్స్ కు అర్హత సాధిస్తారు.

 

రెండు కేటగిరీలు కలుపుకుంటే 79245 మంది ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తారు.

 

ఈలెక్కన చూస్తే మొత్తం అభ్యర్థులు 85వేలకు  పైగా ఉన్నారు. అంటే మరో ఐదారు వేల మంది ఇందులో అనర్హులయ్యే అవకాశం ఉంది.

 

అనర్హులయ్యే ఐదారు వేల మందిలో ఉండేవారెవరో, అర్హులయ్యే 79వేల  మందిలో ఉండేవారెవరరో తేలకుండా మెయిన్స్ కు డేట్ ఫిక్స్ చేయడం  వల్ల అభ్యర్థులు మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. కొంతమంది అభ్యర్థులు  తల్లిదండ్రులను, పిల్లలను వదిలేసి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నారు. అలాంటి వారు కుటుంబాలకు దూరంగా ఉండి చదువుతున్న వేళ రేపు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించలేకపోతే ఇంతకాలం శ్రమ అంతా బూడిదలో పోసినట్లే కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ టిఎస్సిపిఎస్సీ వారు మాత్రం ఇదేమీ అర్థం చేసుకోకుండా రిజల్ట్ ఇవ్వకుండానే తదుపరి పరీక్ష తేదీలను ఏకపక్షంగా ప్రకటించారు. అభ్యర్థులెవరో  తేలకుండా పరీక్ష పెట్టడమేంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

 

అభ్యర్థుల నుంచి మరో వాదన కూడా వినబడుతోంది. ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు మధ్య  కొంత సమయం పెంచాలన్న డిమాండ్ కూడా వస్తోంది. ఈనెల 29, 30 తేదీల్లో పిజిటి మెయిన్స్  జులై 4, 5 తేదీల్లో టిజిటి మెయిన్స్ జరుగుతాయని ప్రకటన  జారీ చేసింది.  టిజిటి పరీక్షకు మరో  పది రోజులు మాత్రమే ఉంది. ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు ? ఎప్పుడు చదవాలి? ఎప్పుడు పరీక్ష రాయాలి అని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే  టిజిటి వారికి కూడా ఇంకో 15రోజులే సమయం ఉంది. వారికి ఎప్పుడు రిజల్ట్ ఇస్తారన్నది ఇంకా తేలలేదు. అందుకే ఫలితాలు వెలువరించిన తర్వాత కనీసం నెల రోజులైనా సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.

 

టిఎస్పిఎస్సీ మాత్రం అభ్యర్థులు అన్నప్పుడు ఎప్పటి నుంచో చదవాలి కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే చదువుతామంటే ఎలా అని ప్రశ్నిస్తోంది. అలా చదివే వారి వినతులను తాము పట్టించుకునే ప్రసక్తే లేదంటోంది. మొత్తానికి టిఎస్సిపిఎస్సీ నిరుద్యోగులను టెన్షన్ పెడుతుందన్నది  అన్ని  వర్గాల నుంచి వినబడుతున్నమాట.

Follow Us:
Download App:
  • android
  • ios