ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహంలో ఉన్న సీఎం కేసీఆర్ రైతే లక్ష్యంగా వరాలు కురిపించడానికి సిద్ధమయ్యారు. ముందస్తు ఎన్నికలకు ముందే రైతుల అభిమానం చూరగొంటే వచ్చేసారి తమదే మళ్లీీ అధికారం అని ఆయన భావిస్తున్నారు.

రైతుల అభిమానం చూరగొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఎన్నికల హామీలో భాగంగా సాగుపై చేసిన అప్పుపై లక్ష రూపాయిల వరకు రుణాల మాఫీ మరికొన్ని పథకాలు రైతులే లక్ష్యంగా ప్రవేశపెట్టినా మూడేళ్ల పాలనలో అవి అన్నదాత అభిమానాన్ని పెద్దగా పొందలేకపోయాయి.

మరోవైపు తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా రైతు ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకో వైపు కందికి మద్దతుధర కరవవడం, మిర్చి రైతులు రోడ్డెక్కి నిరసన తెలపడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శల వర్షం మొదలైంది. ఇక అన్నదాతల్లోనూ అదే విధమైన వ్యతిరేకత వ్యక్తం మవుతోంది.

ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహంలో ఉన్న సీఎం కేసీఆర్ రైతే లక్ష్యంగా వరాలు కురిపించడానికి సిద్ధమయ్యారు. ముందస్తు ఎన్నికలకు ముందే రైతుల అభిమానం చూరగొంటే వచ్చేసారి తమదే మళ్లీీ అధికారం అని ఆయన భావిస్తున్నారు.

అందుకే ఇటీవల ఆయన మళ్లీ రైతు జపం చేయడం మొదలుపెడుతున్నారు. మొన్న రైతులందరికీ ఉచితంగా ఎరువుల పంపిణీ పథకం ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీలోనూ అదే మాట వినిపిస్తున్నారు.


ఈ రోజు దిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం అంతా రైతుల మీదే సాగింది. తెలంగాణలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు తెలంగాణలో అనేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

వాతావరణానికి అనుగుణంగా దేశంలో వ్యవసాయ విభాగాలు చేయాలని, క్రాప్‌ కాలనీలు ఏర్పాటుచేసి ప్రత్యేక పంటలు పండించే చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులకు మద్దతు ధరలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సాగుకు నీరు అందించే ప్రభుత్వ పథకాలకు కేంద్రం సాయం చేయాలని కోరారు. గతంలో ఢిల్లీకి వెళితే టీఎస్ ఐ పాస్ గురించి గొప్పగా చెప్పిన సీఎం ఇప్పుడు మాత్రం రైతుల గురించి తన ప్రసంగానంతా వినియోగించారు. ముందస్తుకు రైతును కూడా సిద్ధం చేసేందుకు ఇకపై ఆయన ప్రసంగాలూ ఇలాగే ఉండొచ్చు.