ఆదిలాబాద్ లో ఘటన ఎంపి ఫ్యామిలీ ఇంట్లో లేని సమయంలో దోపిడీ తెలంగాణలో కలకలం

తెలంగాణలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ప్రజా ప్రతినిధి అయిన ఎంపి ఇంట్లోనే దొంగలు పడి దోపిడీకి తెగబడ్డారు. ఈ ఘటన రాజకీయాల్లోనే కాక పోలీసు వర్గాల్లోనూ సంచనం రేకెత్తించింది.

టిఆర్ఎస్ పార్టీ కి చెందిన ఆదిలాబాద్ ఎంపి జి.నగేష్ ఇంట్లో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. సుమారు 15లక్షల బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. అది కూడా ఎంపి ఇంట్లో ఉన్న సిసి కెమెరాలు ధ్వంసం చేసి మరీ ఈ దోపిడీ పర్వం సాగించారు దుండగులు.

చోరీ ఘటన జరిగిన సమయంలో ఎంపి కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దోపిడీ జరగడంతో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఆదిలాబాద్ జిల్లా మహారాషట్రకు సరిహద్దులో ఉంటుంది. దీంతో మహారాష్ట్ర గ్యాంగులు ఈ దోపిడీకి పాల్పడ్డాయా? లేక బాగా తెలిసిన వారే తెలివిగా సిసి కెమెరాలు ధ్వంసం చేసి దోపిడీ చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎంపి కుటుంబం లేని సమయంలో సిసి కెమెరాలు ధ్వంసం చేసి తెలివిగా దోపిడీ చేశారంటే కచ్చితంగా ఇది తెలిసిన వారి పనే కావొచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ దోపిడీ ఘటనపై ఆదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి