మోడీ సర్కారుపై ఎంపి కవిత మరోసారి ఆగ్రహం

మోడీ సర్కారుపై ఎంపి కవిత మరోసారి ఆగ్రహం

టిఆర్ఎస్ ఎంపి కవిత మోడీ సర్కారుపై మరోసారి ఫైర్ అయ్యారు. చిన్నపని చేయడానికి కేంద్ర సర్కారుకు గిన్ని రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ప్రశ్నించారు. ఢిల్లీలో లోక్‌సభ వాయిదా అనంతరం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు.

హైకోర్టు విభజన కోరుతూ పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్నామని తెలిపారు. గతంలో రాష్ర్టాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు కవిత. కేంద్రం దిగొచ్చి ప్రకటన ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని కవిత అన్నారు. కేంద్రప్రభుత్వం చొరవ చూపి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏపీ స్థలం ఇవ్వలేదని, భవనాలు లేవని సాకులు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుపై నెపం నెట్టడం భావ్యం కాదన్నారు.

వి వాంట్ హైకోర్ట్‌...పార్ల‌మెంటులో ఆందోళన

అంతకుముందు లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. వి వాంట్ హైకోర్టు అంటూ ఎంపీలు నినదించారు. రాష్ట్రం విడిపోయి మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు విభజనపై కేంద్రం జాప్యం చేస్తోందని ఎంపీలు మండిపడ్డారు. చట్టసభల వేదికగా ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. హైకోర్టును విభజన చేయాలంటూ సభలో ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. హైకోర్టు విభజనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎంపీలు నిప్పులు చెరిగారు. హైకోర్టు విభజనను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హైకోర్టు విభజనకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో పోరాడుతామని ఎంపీలు స్పష్టం చేశారు. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page