రెండున్నరేళ్ల పాలనపై సభ నిర్వహించాలనుకున్న కేసీఆర్ డిసెంబర్ 2 న జరగాల్సిన టిఆర్ఎస్ సభ వాయిదా పెద్ద నోట్ల రద్దుతో నిర్ణయం వెనక్కి

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో అధికారం చేపట్టి డిసెంబర్ 2 నాటికి రెండున్నరేళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో భారీ సభ నిర్వహించి టీఆర్ఎస్ పాలనపై చర్చించాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 2 నే హైదరాబాద్ లో భారీ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అయితే కేంద్రం అకస్మాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అధికార టీఆర్‌ఎస్ సభ నిర్వహణపై పునరాలోచనలో పడింది..

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు, ప్రభుత్వ తాజా ఆర్థిక పరిస్థితి వంటి పరిణామాల నేపథ్యంలో సంబరాలకు దూరంగా ఉండాలనే ఆలోచనకు సీఎం కేసీఆర్ వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలోని 31 జిల్లాలకు పార్టీ కొత్త కమిటీలు, రాష్ట్ర కమిటీ, అనుబంధ సంఘాల కమిటీలను నియమించుకుని, వారితో ఒక రోజు సమావేశమై ఆ తర్వాత డిసెంబర్ 2న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. గత రెండున్నరేళ్లలో ఎదురైన సవాళ్లు, సమస్యలను అధిగమించిన తీరు, సాధించిన ప్రగతి వివరాలను దీని ద్వారా ప్రజలకు వివరించాలని సీఎం భావించారు.

అలాగే వచ్చే రెండున్నరేళ్లలో రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించీ ప్రజలకు వివరించాలనుకున్నారు. కానీ పెద్ద నోట్ల రద్దు వల్ల సమస్యలు వస్తాయని, ముఖ్యంగా బహిరంగ సభ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, జనాలను సభకు తరలించడం సమస్యగా మారే అవకాశం ఉండటంతో చివరకు సభను వాయిదా వేయడానికే నిర్ణయించనట్లు తెలుస్తోంది.

కమిటీల నియామకం కూడా..

పార్టీ సంస్థాగత కమిటీల నియామకంను కూడా టీఆర్ఎస్ వాయిదా వేసింది. నోట్ల రద్దుతోనే ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం.