కాంగ్రెస్ లోకి వలసల వరద పారుతుంది కేసిఆర్ పాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ, టిడిపి,ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరేందుకు పెద్ద ఎత్తున వలసలు రాబోతున్నాయని, వారిని స్వాగతిసున్నామని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన హుజూర్ నగర్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో లా కాకుండా 4 విడతలుగా ఋణ మాఫీ చేయడంతో రైతులకు ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. దీంతో 35 లక్షల, 30 వేల మంది రైతుల పాసు పుస్తకాలు బ్యాంక్ ల్లోనే ఉండిపోయాయన్నారు.
శాసన సభలో ముఖ్యమంత్రి స్వయంగా వడ్డీ భారం ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు విడుదల చేయలేదన్నారు. అదేవిధంగా మూడున్నర ఏళ్లపాటు తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులకు కూడా సరియైన కొనుగోలు జరగలేదు. వేలాది మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కనీసం 4,300 మద్దతు ధరకు చర్యలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారం లోకి రాగానే ఏకకాలంలో రైతులకు 2లక్షల ఋణ మాఫీ చేస్తుందన్నారు. వరికి 2వేలు,పత్తికి 5వేలు మద్దతు ధర కల్పిస్తామన్నారు. అవసరమైన చోట పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
అంతకు ముందు మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి, హుజూర్ నగర్, చింతలపాలెం,మేళ్లచెర్వు, పాలకవీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ధరఖాస్తులను పరిశీలించారు. ఈ పధకాల ద్వారా మంజూరైన చెక్కు లను లబ్దిదారులకు అందజేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
