పేపర్ లీక్ .. వాళ్లిద్దరే నిందితులు కాదు, పెద్ద తలకాయల్ని రక్షించే యత్నం : కేటీఆర్‌పై రేవంత్ ఆరోపణలు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో పెద్దలను కాపాడేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరిగిన అన్ని పరీక్షలపై విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ కేసులో పెద్దలను కాపాడేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని.. కేసీఆర్ సమీక్షా సమావేశంలో సిట్ అధికారుల్ని ఎందుకు పిలవలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను కాపాడుతూ.. కిందస్థాయి సిబ్బందిని ఎందుకు బాధ్యుల్ని చేయలేదని ఆయన నిలదీశారు. కమీషన్ ఛైర్మన్‌కు జనార్థన్ రెడ్డి, సెక్రటరీకి ప్రవీణ్ పీఏగా వ్యవహరిస్తున్నారని .. పెద్దోళ్లకు తెలియకుండా వాళ్లు వ్యవహారం నడుపుతారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పెద్ద తలకాయల్ని కాపాడటానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడని.. దీనిపై సీబీఐ విచారణ కోరుతోందని ఎన్ఎస్‌యూఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని ఆయన తెలిపారు. హైకోర్టులో సోమవారం కేసు విచారణకు వస్తుందని రేవంత్ చెప్పారు.
కేసును తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ హడావుడిగా బయటకు వచ్చాడని.. విద్యా శాఖ మంత్రితో మాట్లాడకుండానే ఆయన ఎలా సమాధానం ఇచ్చాడని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం, టీఆర్ఎస్ పెద్దలను కాపాడేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. సీబీఐ బీజేపీ చేతిలో వుందని బయపడితే .. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేందుకు కేసీఆర్ ముందుకు రావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం అగ్నిపరీక్షకు సిద్ధం కావాలన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరిగిన అన్ని పరీక్షలపై విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేస్తే.. ఇద్దరినే నిందితులని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీక్ నేపథ్యంలో రేపు ఎల్లారెడ్డిలో నిరుద్యోగుల నిరాహార దీక్ష చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇదిలావుండగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి తాము సమీక్ష నిర్వహించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సుదీర్ఘంగా సమీక్షించి సీఎం కేసీఆర్ నివేదిక అందించడం జరిగిందని చెప్పారు. పేపర్ లీక్ ఘటనపై మంత్రి కేటీఆర్ ఈరోజు బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఎస్‌పీఎస్సీ 37 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఎన్నో రకాల సంస్కరణలు, మార్పులు తీసుకోచ్చామని తెలిపారు. అందులో భాగంగా ఓటీఆర్(వన్ టైమ్ రిజిస్ట్రేషన్) తీసుకురావడం జరిగిందని చెప్పారు.
ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్‌ల వెనక ఎవరూ ఉన్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించే బాధ్యత తమదని చెప్పారు. నాలుగు పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు మళ్లీ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ పరీక్షలు రాసేందుకు అర్హులేనని చెప్పారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఈ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడతామని.. వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు