Asianet News TeluguAsianet News Telugu

పేపర్ లీక్‌‌ వెనక ఎవరున్నా వదిలిపెట్టం.. వ్యవస్థ వైఫల్యం లేదు.. వాళ్లు మళ్లీ ఫీజు చెల్లించక్కర్లేదు: కేటీఆర్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి తాము సమీక్ష నిర్వహించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సుదీర్ఘంగా సమీక్షించి సీఎం కేసీఆర్ నివేదిక అందించడం జరిగిందని చెప్పారు.

Minister KTR comments in Press meet TSPSC Paper Leak Issue
Author
First Published Mar 18, 2023, 2:13 PM IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి తాము సమీక్ష నిర్వహించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సుదీర్ఘంగా సమీక్షించి సీఎం కేసీఆర్ నివేదిక అందించడం జరిగిందని చెప్పారు. పేపర్ లీక్ ఘటనపై  మంత్రి కేటీఆర్ ఈరోజు బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఎస్‌పీఎస్సీ 37 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌లో ఎన్నో రకాల సంస్కరణలు, మార్పులు తీసుకోచ్చామని తెలిపారు. అందులో భాగంగా ఓటీఆర్(వన్ టైమ్ రిజిస్ట్రేషన్) తీసుకురావడం జరిగిందని చెప్పారు. 

యూపీఎస్సీ చైర్మన్ రెండు సార్లు తెలంగాణకు వచ్చి టీఎస్‌పీఎస్సీకి వచ్చి మార్పులు, సంస్కరణల అధ్యాయనం చేశారని చెప్పారు. 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు వచ్చి టీఎస్‌పీఎస్సీ సంస్కరణల గురించి తెలుసుకున్నారు. భారతదేశంలోని 28 రాష్ట్రాలతో పోలిస్తే.. 8 ఏళ్లలో అత్యధిక ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసింది టీఎస్‌పీఎస్సీ మాత్రమేనని అన్నారు. 7 భాషల్లో ఒకేసారి పరీక్ష నిర్వహించిన ఘనత టీఎస్‌పీఎస్సీకే దక్కుతుందని అన్నారు. 

టీఎస్‌పీఎస్సీ మీద ఇప్పటివరకు ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని అన్నారు. గతంలో ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చేవని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు జరిగిందే.. నీళ్లు, నిధులు, నియమాకాల కోసమని గుర్తుచేశారు. ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పు వల్ల వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని  అన్నారు. అయితే ఇది వ్యవస్థ వైఫల్యం కాదని చెప్పారు. ఈ ఘటన వల్ల లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బంది కలిగిందని.. దీనికి తాము కూడా ఎంతో బాధపడుతున్నామని చెప్పారు. 

ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్‌ల వెనక ఎవరూ ఉన్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించే బాధ్యత తమదని చెప్పారు. నాలుగు పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు మళ్లీ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ పరీక్షలు రాసేందుకు అర్హులేనని చెప్పారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఈ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడతామని.. వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 

రాష్ట్రంలోని స్టడీ సెంటర్స్‌ను మరింత బలోపేతం చేయనున్నట్టుగా తెలిపారు. రీడింగ్ రూమ్స్‌ 24 గంటలు ఓపెన్ ఉంచుతామని చెప్పారు. విద్యార్థులకు అక్కడే భోజన సదుపాయం  కల్పిస్తామని తెలిపారు.  తెలంగాణలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఇలాంటి వ్యక్తుల వల్ల జరిగిన తప్పిదాలు మరోసారి జరగకుండా చూస్తామని చెప్పారు. పొరపాటు జరిగినప్పుడు ఎలా సరిదిద్దాలనే బాధ్యత తమపై ఉందని చెప్పారు. 

పేపర్ లీక్ ఘటనలో అనుమానితుడు, నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌ బీజేపీ క్రియాశీలక కార్యకర్త అని అన్నారు. ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా? అనేది విచారణ చేయాలని డీజీపీని కోరుతున్నట్టుగా తెలిపారు. పేపర్ లీక్ వెనక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు ఎవరూ ఉన్న వదిలిపెట్టేది  లేదని చెప్పారు. 

రాజకీయ పార్టీలు పిల్లలను రెచ్చగొట్టదని కోరారు. టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగ బద్ద సంస్థ అని అన్నారు. అందుకు సంబంధించి కార్యకలాపాల్లో తమ ప్రమేయం ఉండదన్నారు. ఐటీ మినిస్టర్‌ను బర్తరఫ్ చేయాలని కొందరు అంటున్నారని.. అసలు వాళ్లు బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. ఇన్నేళ్లు పారదర్శకంగా నడిచిన టీఎస్‌పీఎస్సీలో ఇద్దరు దుర్మార్గాల పొరపాటు వల్ల తప్పు జరిగితే.. బాధ్యత రహితంగా మాట్లాడటం సరికాదని చెప్పారు. మీడియా కూడా ఇష్టమొచ్చినట్టుగా ఊహాజనిత కథనాలు రాయడం మంచి పద్దతి కాదని అన్నారు. ఎవరూ ఏది చెప్పిన నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం మంచిది కాదని తెలిపారు. 

ఈ విషయాన్ని పిల్లలు కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన పిల్లలు పెద్ద మనసుతో సహకరించాలని కోరారు. తొందరలోనే రద్దైన పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios