టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ఓ బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ గురించి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. 

తెలంగాణలో రాజకీయాలు రైతులు కేంద్రంగా సాగుతున్నాయి. ఉచిత కరెంట్ నుంచి ఇప్పుడు రైతు రుణమాఫీపైకి మళ్లుతున్నది. రేవంత్ రెడ్డి అమెరికాలో ఉచిత కరెంట్ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీపై పోరును ఉధృతం చేశారు. ఉచిత కరెంట్ పై ప్రశ్నలు గుప్పించిన ఆయన తాజాగా, రైతు రుణమాఫీ అంశాన్ని తెరమీదికి తెచ్చారు. తెలంగాణ రైతులకు ఆయన బహిరంగ లేఖ రాసి.. రైతు రుణమాఫీ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపు ఇచ్చారు.

రుణమాఫీ ఎప్పుడు చేస్తారని కేసీఆర్ ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలని రేవంత్ రెడ్డి తన లేఖలో పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి కనీసం 10 గంటలు కూడా ఉచిత విద్యుత్ అందించడం లేదని ఆరోపించారు. అదీగాక, రైతులపైనే రాజకీయం చేస్తున్నారని అన్నారు. 

రుణమాఫీల కోసం రైతులు ఇన్నాళ్లు ఎదరు చూశామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర చివరి బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, కానీ, అందులో రైతు రుణమాఫీకి నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ఇక రుణమాఫీ ఉండదనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమైందని చెప్పారు.

Also Read: నా ఇంటికి తీసుకెళ్లలేను.. దాన్ని సర్కారు గుంజుకుంది: మహిళలతో రాహుల్.. చెల్లి ప్రియాంకతో ఫోన్ మాట్లాడించి.. !

మన రాష్ట్రంలో రుణమాఫీకి సుమారు 31 లక్షల మంది రైతులు అర్హులని వివరించారు. రైతులకు రుణ మాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొన్నారు. కేసీఆర్ మాటలకు మోసపోయి రైతు సోదరులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారని, దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పూనుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీతోపాటు ధాన్య సేకరించిన డబ్బులనూ రైతు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. గత నెల 15వ తేదీ నాటికి రూ. 6,800 కోట్ల మేరకు బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ లేఖతో రాష్ట్రంలో రాజకీయం ఉచిత విద్యుత్ నుంచి రుణమాఫీ వైపునకు మళ్లినట్టుగా స్పష్టమవుతున్నది.