రాహుల్ గాంధీ తాజాగా హర్యానాలోని సోనిపాట్‌కు వెళ్లారు. అక్కడ రైతులతో కలిసి వ్యవసాయ పనుల్లో పాలుపంచుకున్నారు. వారితో మాటామంతీ చేశారు. మహిళా రైతులతో కలిసి సంభాషించారు. కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఆ రైతులకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత ర్యాండమ్‌గా లొకేషన్లు సెలెక్ట్ చేసుకుని పర్యటిస్తున్నారు. అక్కడ స్థానికులతో మమేకం అవుతున్నారు. వారు చేసే పనుల్లో ఆయన కూడా నిమగ్నం అవుతున్నారు. మాట కలుపుతున్నారు. అందరితో కలివిడిగా ఉంటున్నారు. రాజకీయాలనూ మాట్లాడుతున్నారు. ఈ ఘట్టాన్ని షూట్ చేస్తున్నారు. ఈ వీడియోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా, రాహుల్ గాంధీ ఓ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఆ వీడియోలో ఓ మహిళతో ఆసక్తికర సంభాషణ జరిపారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.

రాహుల్ గాంధీ ఇటీవలే హర్యానాలోని సోనిపాట్‌కు వెళ్లారు. అక్కడ సంజయ్ మాలిక్, తస్బీర్ కుమార్ అనే ఇద్దరు రైతు మిత్రులను రాహుల్ గాంధీ కలిశారు. వారిద్దరూ చిన్నప్పటి నుంచి జిగిరి దోస్తులు. కలిసే వ్యవసాయం చేస్తున్నారు. వారితో మాట కలిపిన రాహుల్ గాంధీ ట్రాక్టర్‌తో పొలం దున్నారు. వరి నాటేశారు. నాటేస్తున్న మహిళలతోనూ మాట్లాడారు. వారితోనే కలిసి ఇంటిలో వండుకు వచ్చిన రొట్టెలను కలిసి టిఫిన్ బాక్సుల్లో తిన్నారు.

ఇలా మాట్లాడుతూ.. ఎన్ని గంటలు పని చేస్తారు? మీరు కూడా ట్రాక్టర్ నడుపుతారా? పిల్లలను చదివిస్తున్నారా? వారిని కూలీలుగానే మలుచుతారా? ఉద్యోగాలకు పంపిస్తారా? వంటి ప్రశ్నలు అడిగారు. తాము ట్రాక్టర్ నడపమని నవ్వుతూ బదిలిచ్చిన మహిళలు తమ పిల్లలను చదివించి ఉద్యోగాలకు పంపుతామని చెప్పారు. కానీ, ఇప్పుడు ఉద్యోగాలు, ఉపాధి లేదని వాపోయారు. 

Scroll to load tweet…

ఓ మహిళ నవ్వుతూ రాహుల్ గాంధీతో మాట్లాడుతూ.. మీరు మా ఊరు వచ్చారు కదా. మేం ఢిల్లీలోని మీ ఇంటికి వస్తాం అని అన్నారు. దానికి సమాధానంగా, కచ్చితంగా రండి అంటూ ఆహ్వానం పలికారు. వెంటనే మళ్లీ.. తనకు ఢిల్లీలో ఇల్లు లేదని, తన ఇంటిని సర్కారు గుంజుకుందని అన్నారు. ఢిల్లీ చూశారా? అని అడగ్గా.. ఆ మహిళలు లేదని సమాధానం ఇచ్చారు. అయితే.. ఢిల్లీ చూపిస్తానని వారికి మాట ఇచ్చారు.

అదే సందర్భంలో ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ప్రియాంక గాంధీతో ఆ మహిళలు మాట్లాడారు. ఢిల్లీ నుంచి వారికి రొట్టెలు చేసుకుని తీసుకురమ్మంటారా? అని అడగ్గా.. వారు వద్దని అన్నారు. మీరు తన సోదరుడి వెంటే ఢిల్లీకి వచ్చేయాలని ప్రియాంక గాంధీ వారిని ఆహ్వానించింది.

Also Read: ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన కాంగ్రెస్.. ఆప్ పోరాటానికి మద్దతు.. విపక్ష భేటీకి కేజ్రీవాల్ హాజరు?

ఆ ఇద్దరు రైతులతో వ్యవసాయం గురించి రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఐదు సార్లు పంట వేస్తే మూడు సార్లు నష్టపోతామని, రెండు సార్లు లాభం వస్తుందని రైతులు చెప్పారు. ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదని, గతంలో రైతులకు బీమా ఉండేదని, ప్రాధాన్యత ఉండేదని, ఇప్పుడు లేదని ఆ రైతులు వాపోయారు.

YouTube video player

ఈ వీడియోను ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశ రైతులు నిజాయితీపరులని, దేన్ని అయినా అర్థం చేసుకునే సమర్థులని కితాబిచ్చారు. కష్టం తెలుసని, వారి హక్కులూ వారికి తెలుసు అని వివరించారు. అవసరం వచ్చినప్పుడు నల్ల చట్టాలపై పోరాడుతారని పేర్కొన్నారు. కనీస మద్దతు, బీమా గురించి డిమాండ్ చేస్తారని తెలిపారు. వారి మాటలు వింటే, వారిని అర్థం చేసు కుంటే దేశంలోని అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు.