టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం కేసు నిందితులకు బెదిరింపు: కేటీఆర్ పీఏపై రేవంత్ ఆరోపణలు
కామారెడ్డి జిల్లాలోని గాంధారిలో నిరుద్యోగ దీక్షను ఇవాళ రేవంత్ రెడ్డి నిర్వహించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర కీలకమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
నిజామాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతిది కీలక పాత్ర అని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.కామారెడ్డి జిల్లా గాంధారిలో ఆదివారంనాడు నిరుద్యోగ నిరహారదీక్షను రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.కేసీఆర్ కు కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ కు పీఏ తిరుపతి షాడో మంత్రి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పీఏ తిరుపతి, టీఎస్‌పీఎస్‌సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిలు పక్క పక్క గ్రామాలకు చెందినవారేనని రేవంత్ రెడ్డి చెప్పారు.
కేటీఆర్ పీఏ తిరుపతి ఒత్తిడి మేరకు రాజశేఖర్ రెడ్డికి టీఎస్‌పీఎస్‌సీలో ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం వచ్చిందన్నారు. 2015 నుండి ఇప్పటివరకు జరిగిన పరీక్షా పత్రాల లీకేజీలో కొందరికి లబ్ది జరిగిందని ఆయన ఆరోపించారు. గ్రూప్ -1 ప్రిలిమ్స్ లో వందకు పైగా మార్కులు వచ్చిన వారందరి వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీలో పనిచేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేటీఆర్ పీఏ, రాజశేఖర్ కు సన్నిహితులైన వారికి టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయన్నారు. కేటీఆర్ పీఏ స్వంత ప్రాంతానికి చెందిన 100 మందికి గ్రూప్ -1 లో 100కు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన వారిని విచారించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ఏ విచారణ చేసినా కేటీఆర్ పేషీ నుండే మూలాలు బయటపడతాయని ఆయన ఆరోపించారు. ఈ కథ నడిపింది మొత్తం కేటీఆర్ పీఏ తిరుపతి అని ఆయన చెప్పారు.
జైలులో ఉన్న ప్రశ్నాపత్రం లీకేజీ నిందితులను బెదిరించారని రేవంత్ రెడ్డి చెప్పారు. . పేపర్ లీకేజీ కేసులో పెద్దల పేర్లు చెబితే ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో శంరకలక్ష్మి పాత్రను కూడా బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు.
also read:టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ .. తమిళిసై పరోక్ష వ్యాఖ్యలు , విద్యార్ధుల పేరు చెప్పి సర్కార్‌కు చురకలు
దర్యాప్తు జరగకుండానే ఇద్దరు తప్పు చేశారని కేటీఆర్ ఎలా చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే నిందితులను కస్టడీలోకి తీసుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రశ్నాపత్రాల లీక్ కేసులో కేటీఆర్ కార్యాలయమే అన్ని వ్యవహరాలను చక్కదిద్దిందని ఆయన విమర్శించారు. కేటీఆర్ బావమరిది కి సిట్ ఇంచార్జీ ఏఆర్ శ్రీనివాస్ సన్నిహితుడని రేవంత్ రెడ్డి చెప్పారు.