టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ .. తమిళిసై పరోక్ష వ్యాఖ్యలు , విద్యార్ధుల పేరు చెప్పి సర్కార్‌కు చురకలు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి తెలంగాణ గవర్నర్ తమిళిసై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. విద్యార్ధులు గతంలో మాదిరిగా పరీక్షలకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం రాయకుండా ప్రశ్నాపత్రాలు ఎక్కడ దొరుకుతాయో వెతుకున్నారంటూ ఆమె చురకలంటించారు. 
 

telangana governor tamilisai soundararajan indirect comments on tspsc paper leak

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి తెలంగాణ గవర్నర్ తమిళిసై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శనివారం జేఎన్‌టీయూహెచ్ స్నాతకోత్సవానికి హాజరైన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు విద్యార్ధులకు పరీక్షలకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేవారని తమిళిసై అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రశ్నాపత్రాలు ఎక్కడ తయారవుతాయో వెతుకుతున్నారని ఇది దురదృష్టకరమని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పరీక్షలకు హాజరైతే చాలని విద్యార్ధులు అనుకుంటున్నారని తమిళిసై వ్యాఖ్యానించారు. మరి దీనిపై బీఆర్ఎస్ వర్గాలు, తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలావుండగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి తాము సమీక్ష నిర్వహించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సుదీర్ఘంగా సమీక్షించి సీఎం కేసీఆర్ నివేదిక అందించడం జరిగిందని చెప్పారు. పేపర్ లీక్ ఘటనపై  మంత్రి కేటీఆర్ ఈరోజు బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఎస్‌పీఎస్సీ 37 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌లో ఎన్నో రకాల సంస్కరణలు, మార్పులు తీసుకోచ్చామని తెలిపారు. అందులో భాగంగా ఓటీఆర్(వన్ టైమ్ రిజిస్ట్రేషన్) తీసుకురావడం జరిగిందని చెప్పారు. 

ALso Read: పేపర్ లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరం :సిట్ కస్టడీకి ప్రవీణ్, రాజశేఖర్.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి తరలింపు

ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్‌ల వెనక ఎవరూ ఉన్న వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించే బాధ్యత తమదని చెప్పారు. నాలుగు పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు మళ్లీ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ పరీక్షలు రాసేందుకు అర్హులేనని చెప్పారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఈ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడతామని.. వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.

ఇక, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్‌లు గత అక్టోబరు నుంచే పలు పరీక్షలకు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. కమిషన్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ దొంగిలించడం ద్వారా ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసినట్టుగా రాజశేఖర్ చెప్పినప్పటికీ.. అందులో నిజం లేదని అధికారులు నిర్దారణకు వచ్చినట్టుగా సమాచారం. అధికారుల దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే నిందితులు ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)  ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేయగా.. శుక్రవారం రోజున గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా బోర్డు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం నివేదిక‌తో తమ అంతర్గత విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios