Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ మహారాజునని ఊహించుకుంటున్నారు, దొరతనం ప్రమాదకరం: విజయశాంతి ఫైర్

పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న నియంతృత్వ తీరుపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

tpcc campaign committee chairman vijayashanthi fires on cm kcr
Author
Hyderabad, First Published Sep 6, 2019, 7:18 PM IST

హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి  ఆలయంలో రాతి స్థంబాలపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, కారు చిత్రాలను చెక్కించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నాయి. 

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, సినీనటి విజయశాంతి సైతం దేవాలయంలో కేసీఆర్ చిత్రాలను చెక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా ప్రచారం కోసం వాడుకోవడం సిగ్గు చేటు అంటూ తిట్టిపోశారు. 

ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పదేపదే సారు... కారు.. సర్కార్ అనే డైలాగ్ వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థమైందంటూ సెటైర్లు వేశారు. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో చేపడుతున్న ఆధునీకరణలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న స్థూపాలలో దేవతామూర్తులతో పాటు కెసిఆర్.. కార్ గుర్తును.. టిఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడంపై విజయశాంతి మండిపడ్డారు. 

దేవాలయాల్లో చిత్రాలు చెక్కించుకోవడం పట్ల కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థమవుతోందని విమర్శించారు. రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కెసిఆర్‌ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనలను కెసిఆర్ రాజకీయ కోణంలో చూసి వాటిని లైట్‌గా తీసుకునే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను కూడా ఇక్కడి ప్రజలు ఎంతో పవిత్ర క్షేత్రంగా నమ్ముతారని విజయశాంతి స్పష్టం చేశారు.  

అంతటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న నియంతృత్వ తీరుపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ధర్మో రక్షతి రక్షితః అనే నానుడికి తగ్గట్లు హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టిఆర్ఎస్ పాలకులకు కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయశాంతి. 
 

ఈ వార్తలు కూడా చదవండి

యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ బొమ్మలు

యాదాద్రి ఆలయానికి మహా ద్వారాలు

Follow Us:
Download App:
  • android
  • ios