కరీంనగర్: కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే బలితీసుకుంటోంది. కడుపున పుట్టినవాడు చనిపోయింది కన్న తల్లిదండ్రులకు తెలీకుండా... భార్య మరణించిన విషయం భర్తకు తెలియకుండా చేసి మానవ సంబంధాలను కూడా తుడిచిపెడుతోంది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు మొత్తం కుటుంబమే తుడిచిపెట్టుకుపోయిన విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

మంచిర్యాల మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు అక్కనపెల్లి కుమారస్వామి(70)తో పాటు భార్య భూలక్ష్మీ(65), కొడుకు రఘు(28)  పదిహేను రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు.  అయితే తండ్రీ కొడుకుల పరిస్థితి విషమంగా వుండటంతో కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరారు. భూలక్ష్మి పరిస్థితి మెరుగ్గా వుండటంతో హోంఐసోలేషన్ లోనే వుంది. 

read more  క్షమించు గోపీ భాయ్.. అంటూ ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. !

ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల్లోనే రఘు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించి మరణించాడు. ఈ విషయం తెలిస్తే కరోనాతో బాధపడుతున్న తల్లిదండ్రులకు ఈ విషయం తెలియనివ్వకుండానే బంధువులు అంత్యక్రియలు కానిచ్చారు. ఆ తర్వాతి రోజే హోంఐసోలేషన్ లో వున్న భూలక్ష్మీ కూడా చనిపోయారు. ఈ విషయాన్ని కూడా ఆమె భర్త కుమారస్వామికి తెలియజేయనివ్వలేదు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారస్వామి కూడా మృతిచెందాడు. 

ఇలా ఓ కుటుంబం మొత్తాన్ని కరోనా బలితీసుకుంది. కరోనా బారిన పడ్డ ముగ్గురు పదిహేను రోజుల్లోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో తాళ్లపేటలో తీవ్ర విషాదం నెలకొంది.