IT Raids : నాపై ఐటీ దాడులకు కారణం అతడే...:కాంగ్రెస్ అభ్యర్థి వివేక్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందని బిజెపి, బిఆర్ఎస్ నాయకులకు అర్థమైపోయిందని... అందువల్లే రెండుపార్టీలు కలిసి ఐటీ దాడుల కుట్రలకు తెరతీసారని వివేక్ ఆరోపించారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. అయితే తనపై ఐటీ దాడికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే, చెన్నూరులో తన ప్రత్యర్థి బాల్క సుమన్ కారణమని వివేక్ అన్నారు. అతడు ఫిర్యాదు చేయడంవల్లే ఐటీ అధికారులు దాడిచేసారన్నారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి ఏ దాడికి భయపడబోనని వివేక్ అన్నారు.
బిజెపి, బిఆర్ఎస్ కలిసే తనపై కుట్రలు పన్నుతున్నాయని... ఎన్నికల కోడ్ ఉళ్లంఘించి మరీ ఐటీ దాడులు చేయించారని వివేక్ ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకుడు ఫిర్యాదు చేసాడని తనపై ఐటీ దాడులు చేయించారు... మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డాడు... అతడిపై ఇలాగే ఐటీ దాడులు చేయించే దమ్ముందా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపిని నిలదీసారు. ఎవరేం చేసినా చెన్నూరులో తన విజయం ఖాయమని వివేక్ అన్నారు.
తనపై ఐటీ దాడులతో తెలంగాణ ప్రజలకు బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటేనని మరోసారి అర్థమయ్యిందన్నారు వివేక్. ఇప్పటికే కాంగ్రెస్ వైపే ప్రజలు వున్నారు... కాబట్టి స్పష్టమైన మెజారిటీతో అధికారంలో రావడం ఖాయమన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగా సీట్లు కాంగ్రెస్ కు వస్తాయని వివేక్ తెలిపారు.
Read More బండి సంజయ్ కు గుండెపోటు... ఇలాంటి డ్రామాలే నమ్మొద్దు..: గంగుల కమలాకర్ (వీడియో)
ఇటీవలే బిజెపి పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరారు వివేక్. వెంటనే అతడికి చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇలా ఎన్నికల ప్రచార బిజీలో వున్న వివేక్ కు మంగళవారం ఉదయమే ఐటీ దాడులతో షాక్ తగిలింది. హైదరాబాద్ తో పాటు మంచిర్యాలలోని ఇళ్లు, కార్యాలయాలు, అనుచరులు, బంధువుల ఇళ్లలో ఐటీదాడులు కొనసాగాయి. ఇలా సాయంత్రం వరకు ఈ ఐటీ సోదాలు కొనసాగాయి. ఐదు రోజుల క్రితం వివేక్ కంపెనీలో అధికారులు రూ. 8 కోట్లు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం.
ఐటీ రైడ్స్ గురించి తెలియగానే చెన్నూరులోని వివేక్ ఇంటివద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కలిసిపోయి కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసారని... అందులో భాగంగానే ఇలా ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.