ఉత్తరాఖండ్ సొరంగం ఘటన : సంచలనం చేయొద్దు .. వాళ్ల బాధను అర్ధం చేసుకోండి , టీవీ ఛానెళ్లకు కేంద్రం అడ్వైజరీ
ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారాలో 10 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల రెస్క్యూ ఆపరేషన్‌లను సంచలనాత్మకంగా కవరేజీ చేయడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌లకు అడ్వైజరీ జారీ చేసింది.
ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారాలో 10 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల రెస్క్యూ ఆపరేషన్‌లను సంచలనాత్మకంగా కవరేజీ చేయడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌లకు అడ్వైజరీ జారీ చేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ అడ్వైజరీ ప్రకారం .. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కుటుంబ సభ్యుల మానసిక స్థితిని పరిగణనలోనికి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్‌ల ముఖ్యాంశాలు, వీడియోలు ప్రసారం చేసే సమయంలో ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్‌లో సున్నితంగా వ్యవహరించాలని సూచించింది.
రెస్క్యూ ఆపరేషన్స్ సైట్‌కు సమీపంలో కెమెరాలు, ఇతర పరికరాలను ఉంచడం ద్వారా కొనసాగుతున్న సహాయక చర్యలు, ఇతర కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం వుందని అడ్వైజరీ హెచ్చరించింది. సమస్యను సంచలనం చేయడం నుంచి రెస్క్యూ ఆపరేషన్లను జరుగుతున్న సొరంగం సైట్‌కు సమీపంలో ప్రత్యక్ష పోస్టులు , వీడియోలను కవర్ చేయొద్దని సూచించింది.
వివిధ ఏజెన్సీల ద్వారా మానవ ప్రాణాలను రక్షించే కార్యకలాపాలకు కెమెరామెన్‌లు, రిపోర్టర్లు , పరికరాలను దగ్గరగా వుంచడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని వార్తా ఛానెల్స్‌ను కేంద్రం కోరింది. ఈ విషయంపై నివేదించేటప్పుడు ముఖ్యాంశాలు, వీడియోలు, చిత్రాలను ప్రసారం చేసేటప్పుడు.. వీక్షకుల మానసిక స్ధితిని పరిగణనలోనికి తీసుకోవాలని సూచించింది.
కాగా.. సిల్‌క్యారా సొరంగంలో కూలిపోయిన చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. డ్రిల్లింగ్ యంత్రంతో కూలిన శిథిలాల తొలగింపు ప్రక్రియ 24 మీటర్ల ముందుకు సాగింది. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఐదో పైపును అమరుస్తున్నట్లు ఎన్‌హెచ్ఐడీసీఎల్ తెలిపింది. డ్రిల్లింగ్ యంత్రం డీజిల్‌ది కావడంతో మధ్యలో దానికి విరామం ఇస్తున్నామని.. ఇండోర్ నుంచి మరో డ్రిల్లింగ్ యంత్రాన్ని తీసుకొస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అలాగే తమ వారి క్షేమ సమాచారం కోసం ఆందోళన పడుతున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కార్మికులతో మాట్లాడిస్తున్నారు.