తెలంగాణలో భయపెడుతున్న వీధి కుక్కలు: కరీంనగర్, హైద్రాబాద్‌లలో ముగ్గురిపై దాడి
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వీధి కుక్కలు స్వైర విహరం చేశాయి. వీధి కుక్కల దాడిలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వీధి కుక్కల దాడిలో ముగ్గురు గాయపడ్డారు. రెండు రోజుల క్రితం హైద్రాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కలు దాడి చేయడంతో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
హైద్రాబాద్ నగరంలోని చైతన్యపురి మారుతీనగర్ లో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు మంగళవారంాడు దాడికి దిగాయి. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రాంతంలో వీధికుక్కలను తీసుకెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా బాధితుడి కుటుంబసభ్యులు చెప్పారు. అయితే కుక్కలను కొందరు మళ్లీ తీసుకొచ్చారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. ఈ ప్రాంతంలో కుక్కలను వెంటనే తీసుకెళ్లాలని బాధిత కుటుంబం కోరుతుంది.
also read:కుక్కల దాడిలో చిన్నారి బలి.. అంబర్‌పేట్‌లో పోలీసుల విచారణ, కార్ల షోరూమ్ ప్రతినిధులపై కేసు
మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ని రెండు మండలాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం ఎస్సీ హస్టల్ లో కి చొరబడి వీధి కుక్కలు సుమన్ అనే విద్యార్ధిపై దాడి చేశాయి. ఈ దాడిలో సుమన్ కు తీవ్ర గాయాలయ్యాయి. సుమన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు హస్టల్ సిబ్బంది.ఈ ఘటనతో హస్టల్ విద్యార్ధులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఇదే జిల్లాలోని వీణవంక మండలం మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాపాక యేసయ్య పై వీధికుక్కలు దాడికి ప్రయత్నించాయి. బైక్ పై వెళ్తున్న యేసయ్యపై వీధి కుక్కలు దాడికి ప్రయత్నించాయి.దీంతో ఆయనవాహనాన్ని వేగంగా నడిపి కిందపడిపోయాడు. ఈ ఘటనలో యేసయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.