రాజీనామా తర్వాత 24 గంటల్లోనే రేవంత్ కు ఝలక్ పోలీసుల తీరుపై రేవంత్ సీరియస్

టిడిపికి రాజీనామా చేసిన తర్వాత 24 గంటల్లోనే తెలంగాణ సర్కారు రేవంత్ కు తొలి షాక్ ఇచ్చింది. రాజీనామా లేఖలోనే సిఎం కేసిఆర్ మీద విరుచుకుపడ్డారు రేవంత్. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, కేసిఆర్ రాచరిక పాలనను అంతం చేయడం కోసమే టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు రేవంత్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు ఇవాళ కొడంగల్ లో జరిగిన కార్యకర్తల సభలోనూ రేవంత్ తెలంగాణ సిఎం కేసిఆర్ మీద, కేసిఆర్ ఫ్యామిలీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు.

ఇక సోమవారం ఉదయం జలవిహార్ లో భారీ సభ ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు కూడా. ఆ సభకు కేసిఆర్ వ్యతిరేకులంతా హాజరు కావాలని రేవంత్ పిలుపునిచ్చారు. జలవిహార్ సభ విషయంలో తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జల విహార్ లో సభకు అనుమతి ఇవ్వకుండా నిరాకరించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని అందుకే జలవిహార్ లో సభ జరుపుకోవడానికి అనుమతి లేదని హైదరాబాద్ పోలీసులు తేల్చి చెప్పారు.

పోలీసుల తీరు పట్ల రేవంత్ సీరియస్ అయ్యారు. జలవిహార్ లో వేరే కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిన పోలీసులు తమ సభకు ఎందుకు ఇవ్వరని డిసిపి ని నిలదీశారు. తెలంగాణ పోలీసులు ఇలా కూడా నా మీద కక్ష తీర్చుకుంటున్నారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

సభకు అనుమతి రాకపోవడంతో జలవిహార్ లో జరపతలపెట్టిన సభను రవేంత్ రెడ్డి జూబ్లిహిల్స్ లోని తన ఇంటి వద్దే మీటింగ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేపు సభకు వచ్చేవారంతా తన ఇంటికే చేరుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. కేసిఆర్ ను వ్యతిరేకించే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ సభకు వచ్చి మద్దతు తెలపాలని ఆయన కోరారు.