జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో మూడో బ్యాచ్ లో గందరగోళం నేపథ్యంలో ఈ బ్యాచ్ పరీక్షను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో బ్యాచ్ కు నిర్వహించాల్సిన పరీక్ష వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం కర్మన్ ఘాట్ లోని అయాన్ డిజిటల్ కేంద్రం, సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలోని కేంద్రంలోనూ జరిగిన మూడో బ్యాచ్ పరీక్షలను వాయిదా వేసినట్లుగా ప్రకటించింది. సాంకేతిక కారణాలవల్ల ఈ పరీక్ష రాయలేక పోయిన అభ్యర్థులకు.. పరీక్షను మరోసారి నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

హైదరాబాద్ మల్లాపూర్ లోని అయాన్ డిజిటల్ జోన్ 1,2 లలో ఆన్ లైన్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు దాదాపు 2వేలమంది హాజరయ్యారు. ఈ పరీక్ష కోసం మూడు బ్యాచులుగా అభ్యర్థులను విడగొట్టారు. మొదటి బ్యాచుకు ఉదయం 8.30నుంచి 10.30వరకు ఎగ్జామ్ జరిగింది. రెండో బ్యాచ్ కు మద్యాహ్నం 12.30నుంచి 2.30గంటల వరకు పరీక్ష జరిగింది. ఈ రెండు బ్యాచ్ ల ఎగ్జామ్స్ ఎలాంటి సమస్యలు లేకుండా.. ప్రశాంతంగానే జరిగాయి. 

కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో సాంకేతిక సమస్యలు: నాచారంలో అభ్యర్ధుల ఆందోళన

అదే రోజు మూడో బ్యాచ్ ఎగ్జామ్ కూడా షెడ్యూల్ చేశారు. అది సాయంత్రం 4.45 నుంచి 6.45 గం.ల వరకు పెట్టాల్సి ఉంది. మూడో బ్యాచ్ లో ఉన్న అభ్యర్థులంతా కూడా నిర్ణీత సమయానికే పరీక్షకు హాజరయ్యారు. తమకు కేటాయించిన కంప్యూటర్ల ముందు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కంప్యూటర్లు మొరాయించాయి.. టెక్నికల్ ప్రాబ్లం వల్ల లాగిన్ అవ్వలేకపోయారు. దీంతో వారిలో ఆందోళన మొదలయ్యింది. 

వెంటనే అధికారులు అన్ని రకాల చర్యలకు ఉపక్రమించారు. ఎంత ప్రయత్నించినా టెక్నికల్ ప్రాబ్లం కొలిక్కి రాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. రాత్రి 7.30 వరకు మల్లాపూర్-నాచారం మెయిన్ రోడ్ మీద రాస్తారోకో నిర్వహించారు. వీరి నిరసనతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రెండు గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అధికారులు, పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మూడో బ్యాచ్ పరీక్ష వాయిదా వేశామని తెలిపారు. ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు.